బౌద్ధ ధర్మంతోనే ప్రపంచ శాంతి
అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుపాక ఎల్లయ్య
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవీయ విలువలు కలిగిన బౌద్ధ ధర్మం పాటించడం వల్లనే ప్రపంచ శాంతి నెలకొంటుందని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుపాక ఎల్లయ్య అన్నారు. అశోక విజయ దశమి పురస్కరించుకొని మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లోని బౌద్ధ ఆరామం వద్ద జరిగిన అశోక విజయ దశమి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో అమితమైన కోరికల ద్వారా మనుషులకు దుఃఖం సంభవిస్తుందని దుఃఖ నివారణకు అమితమైన కోరికలు తగ్గించుకోవడంతో పాటు మానవీయ విలువలతో, కరుణతో సాటి మనుషులను సమానత్వంగా చూసిన నాడే మానవ సమాజం మనుగడ సాధిస్తుందని మూడు వేల ఏండ్ల క్రితమే గౌతమ బుద్ధుడు బోధించాడని, బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న చాలా దేశాలు శాంతియుత జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. బౌద్ధం పుట్టిన భారత ఉప ఖండంలో బౌద్ధ ధర్మాన్ని, వాస్తవాలను నాశనం చేసి మనుధర్మ పాలన కొనసాగుతుందని అందువల్లనే సకల అసమానతలతో, కులాల కుళ్లుతో, మత ఘర్షణలతో భారత సమాజం నష్ట పోతుందని అన్నారు. మానవీయ విలువలకు ప్రతి రూపమైన బౌద్ధ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి పాటించిన నాడు దేశంలో సమసమాజం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
సత్యాన్ని దాచి దసరా పండుగ
ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
కళింగ యుద్ధంలో విజయం సాధించిన అశోకుడు ఆ యుద్ధ సమయంలో పారిన నెత్తురు, తెగిన నరఖాంటాలను చూసి చలించి పోయి తీవ్ర ఆవేదనతో ఉన్న తనను తన సహచరి బౌద్ధ భిక్షువు వద్దకు తీసుకెళ్లిందని, ఆ బౌద్ధ భిక్షువు చేసిన బౌద్ధ ధర్మ బోధన, అహింస, కరుణ ద్వారానే శాంతిని నెలకొల్పవచ్చని, బౌద్ధ ధర్మాన్ని పాటించడం ద్వారానే స్వేచ్ఛ, సమానత్వం నెలకొంటుందని జ్ఞానోదయం చెందిన అశోకుడు దశమి నాడు తన ఆయుధాన్ని వదలి ఆరోజు నిజమైన విజయంగా ప్రకటించుకున్నాడని ఆనాటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో దశమి నాడు విజయ దశమి జరుపుకోవడం భారత ఉపఖండంలో కొనసాగుతుందని సాయిని నరేందర్ అన్నారు. విలువలకు, శాంతికి, కరుణకు ప్రతిరూపమైన విజయ దశమి పండుగను ప్రజల నుండి దూరం చేయడానికే భారత దేశానికి వలస వచ్చిన ఆర్య బాపండ్లు అదే దశమి రోజు దసరా పండుగను తీసుకొచ్చి ప్రజల చేత తప్పుడు పండుగను చేయిస్తున్నారని అన్నారు.
యుద్ధం ద్వారా శాంతి రాదని, యుద్ధం ద్వారా విజయం సిద్ధించదని, శాంతి ద్వారా, ప్రేమ, ఆప్యాయతల ద్వారా, స్నేహం, సమానత్వం, సౌభ్రాతృత్వం ద్వారానే శాంతిని నెలకొల్పొగలగుతామని అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజు నిజమైన విజయ దశమని, అదే దశమి రోజున అక్టోబర్ 14, 1956 నాడు నాగపూర్ లోని దీక్ష భూమిలో ఆరు లక్షల మందితో అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని అన్నారు. ఆ బౌద్ధ ధర్మంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతుత్వాన్ని మన రాజ్యాంగంలో కూడా పొందుపరచారని అన్నారు. కానీ గత 3 వేల ఏండ్ల క్రితం భారత దేశంలో చొరబడిన ఆర్య బాపండ్లు పుక్కిటి పురాణాలు, కట్టు కథల పండుగలను మన ముందుకు తెచ్చి మన పూర్వీకులను చంపిన రోజునే మన చేత పండుగలను చేపిస్తున్నారు. అసలైన చరిత్ర కనుమరుగు చేయడానికే ఇలాంటి పండుగలను మన ముందుకు తెచ్చారనే సత్యాన్ని మనం తెలుసుకోవాలనేదే నా భావనని అన్నారు. దుర్గాదేవి మహిషాసురుడిని చంపిన రోజు, రావణాసురుడిని వధించే రామాయణం, మహాభారతంలోని పాండవులు, జమ్మి చెట్టు, ఆయుధాలు ఇవన్నీ ఒక దానికి ఒకటి సంబంధం లేని వివిధ కాలాలకు చెందిన పుక్కిటి పురాణాలని అన్నారు. ఆయుధ పూజ చేసి ఆయుధంతో సాటి మనుషులను సంహరిద్ధామా శాంతి పూజ చేసి మనుషులను ప్రేమిద్దామా ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. అశోకుడిని, బౌద్ధ ధర్మాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లి సమసమాజం ఏర్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు జన్ను పద్మ, మాదిగ జాంబవ జాగృతి సంగం నాయకులు బొల్లె
సాంబయ్య, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుట్ల రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్ర శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి బంగారు బాబు, డి ఎస్ పి నాయకులు మేకల సుమన్, సురేష్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బూజు గుండ్ల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి మంత్రి చాణిక్య, వివిధ సంఘాల నాయకులు బీరం రాము, దేవరాజుగట్టు శ్రీనివాస్, భరత్, మాయవతి, ప్రసాద్, ప్రకాష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

