తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అనిల్‌కుమార్ సింఘాల్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా ప్రమాణం చేశారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ అనిల్ సింఘాల్.. రెండోసారి ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. కాలినడక మార్గంలో భక్తులు కొన్ని సమస్యలు తమ దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరించి మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ప్రత్యేకంగా సూచించారని వెల్లడించారు.
ఇకపోతే, పదవీబదిలీ అయిన పూర్వ ఈవో శ్యామలరావుకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ.. తితిదే ఈవోగా పనిచేయడం నిజంగా అరుదైన అవకాశం అని, ఇది పూర్వజన్మ సుకృతమేనని అన్నారు. 14 నెలల పదవీకాలంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు, రాబోయే 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. బోర్డు సహకారంతో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయని శ్యామలరావు విశ్వాసం వ్యక్తం చేశారు.