ఇండియన్ రైల్వే రిజర్వేషన్ సిస్టం రూపొందింది హైదరాబాద్ లోనే
దేశాల్లోని మొదటి ‘రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్లాన్” మొదలయింది కూడా ఇక్కడే
1908 మూసీ వరదల తర్వాతే ఆధునిక హైదరాబాద్ కు అంకురార్పణ
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. దాదాపు లక్షన్నర కిలోమీటర్ల నెట్ వర్క్ కలిగి ఉంది. ఇంత పెద్ద వ్యవస్థ అయిన రైల్వే రిజర్వేషన్ విధానం మన హైదరాబాద్ లోనే రూపుదిద్దుకుంది. దీని నేపధ్యం తెలుసుకుందాం. ఇండియా లో గతంలో ఐ.బీ.ఎం అనే విదేశీ కంప్యూటర్ సంస్థ ఉండేది. ఈ కంపెనీ 100 శాతం తన వాటానే ఉంటుందని తెలుపగా, దీనిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో 1977 లో ఈ ఐ.బి.ఎం సంస్థను ఇండియా నుండి వెళ్లిపోవాలని అప్పటి జనతాదళ్ దళ్ ప్రభుత్వం ఆదేశించింది. దీనితో అది భారత్ నుండి వెళ్ళిపోయింది. అయితే, ఐ.బి.ఎం ఆధ్వర్యంలో పెద్ద పెద్ద కంప్యూటర్లు ఉండేవి. ఐ.బి.ఎం వెళ్ళిపోయినా ఇవి ఇక్కడే ఉన్నాయి. వాటి నిర్వహణకు ఒక సంస్థ కావాల్సి వచ్చింది. అప్పుడే, హైదరాబాద్ లో సి.ఎం.సి (కంప్యూటర్ మైంటెనెన్సు కార్పొరేషన్ ఏర్పాటైంది. అప్పట్లో బ్రిటన్ నుండి వచ్చిన రమేష్ జంజన్వాలా (వార్ధా నివాసి ) మొదటి ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. ఇదే సి.ఎం.సి లో సి.పీ గుప్తా అనే అధికారి సి.ఎం.డీ గా ఉండేవారు. ఆయన ఒకసారి తన సోదరి హైదరాబాద్ నుండి బొంబాయి కు వెళ్లేందుకు నాంపల్లి స్టేషన్ కు వెళ్లగా రైల్వే రిజర్వేషన్ కై దాదాపు నాలుగు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు రిజర్వేషన్ కై ప్రత్యేక సాఫ్వేర్ చేయాలని సి.పీ.గుప్తా నిర్ణయించి సి.ఎం.సి లోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి బాధ్యతలు అప్పగించారు. అప్పుడు రూపొందించిన కంప్యూటర్ ఆధారిత రైల్వే రిజర్వేషన్ విధానాన్ని భారతీయ రైల్వే స్వీకరించి దేశం మొత్తంలో అమలు చేశారు. ఇది, భారతీయ రైల్వే లో ఒక విప్లవాత్మక మార్పు.
అదేవిధంగా, హైదరాబాద్ శివారు (పఠాన్చెరు సమీపంలో ) లో ఏర్పాటైన iCRISAT (ఇండియన్ క్రాప్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాఫిక్స్ ) ఏర్పాటుకై తొలుత ఇండోర్, బనారస్, హైదరాబాద్ నగరాలను పరిగణనలో తీసుకున్నారు. అయితే, హైదరాబాద్ లో అప్పటికే మంచి విద్యా సంస్థలు, రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లు, వైద్య సదుపాయాలతోపాటు మంచి భవనాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఉండడం, ఇక్కడి భూమి కూడా పరిశోధనకు అనువుగా ఉండడంతో ICRISAT ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారట.
నిజాం స్టేట్ లో హైదరాబాద్ లో 1908 లో వచ్చిన మూసి వరదల అనంతరమే హైదరాబాద్ లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశోధక సంస్థల ఏర్పాటుకు బీజం పడింది. నిజాం ప్రభుత్వం పై బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ పరోక్ష ప్రభావం బాగా ఉండేది.హైదరాబాద్ ను మూసి వరదల నుండి కాపాడానికై అప్పటి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను నిజాం కోరిక మేరకు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం పిలిపించింది. అప్పట్లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉన్న విశ్వేశ్వరయ్య తన రిటైర్మెంట్ అనంతరం యూరప్ దేశాల పర్యటనకు వెళ్లారు. అక్కడినుండి నిజాం పిలుపు మేరకు హైదరాబాద్ కు వచ్చి ఆధునిక హైదరాబాద్ కు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో దేశంలోని మరే ఇతర సంస్థానాలలో లేని విధంగా జీత భత్యాలు ఉండడం చేత హైదరాబాద్ లో ఉద్యోగం చేయడానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుండి అత్యంత ప్రతిభావంతులు వచ్చేవారు. దీనిలో భాగంగా హైదరాబాద్ స్టేట్ కు వచ్చిన విశ్వేశ్వరయ్య హైదరాబాద్ రక్షణకు ఫ్లడ్ ప్రొటెక్షన్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్థవంతంగా అమలు చేశారు. అంటే, ఒక విధంగా చెప్పాలంటే, దేశంలో మొట్టమొదటి సారిగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ లోనే ప్రారంభమయింది. ఇప్పుడు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మూసి నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 1910 అనంతరమే హైదరాబాద్ ఒక ప్రణాళికా బద్దంగా అభివృద్ధి ప్రారంభమయింది. 1918 లో హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ రీసర్చ్ ల్యాబ్ ప్రారంభమయింది. ఇది కాల క్రమేణా ఆర్.ఆర్. లాబ్ గా రూపాంతరం చెందింది.
( దినేష్ సి.శర్మ రచించిన ‘బియాండ్ బిర్యానీ – ది మేకింగ్ అఫ్ గ్లోబలైజ్డ్ హైదరాబాద్ పుస్తకం లోనుంచి ఈ కొన్ని అంశాలను స్వీకరించడం జరిగింది).
కన్నెకంటి వెంకటరమణ, 9849905900


