హనుమకొండ: తల్లా పద్మావతి విద్యాసంస్థల సమూహం డైరెక్టర్ తల్లా చైతన్యకు KL University ద్వారా పీహెచ్డీ పట్టా ప్రదానం చేయబడినట్లు చైర్మన్ తల్లా మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా కాజీపేటలోని తల్లా పద్మావతి ఇంజనీరింగ్ కళాశాల (TPCE)లో సమావేశం నిర్వహించారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, చైతన్య “Isoxazole, Thiazole, Thiadiazole, Isatin మరియు Benzimidazole Derivatives సంశ్లేషణ మరియు జీవక్రియల పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి KL University కు థీసిస్ సమర్పించారు. ఈ పరిశోధనను డా. ఏ. వెంకటేశ్వరరావు (రసాయన శాస్త్ర విభాగాధిపతి, KL యూనివర్సిటీ) మరియు డా. డి. ప్రభాకరాచారి (భౌతిక శాస్త్ర విభాగం, Kakatiya Institute of Technology and Science) సంయుక్త మార్గదర్శకత్వంలో పూర్తి చేశారు.
హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ మరియు ఔషధ రసాయన శాస్త్ర రంగాలలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనాలపై ఆమె పరిశోధన కేంద్రీకృతమైంది. పరిశోధన కాలంలో అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్స్‌లో (SCI, Scopus) నాలుగు పరిశోధన పత్రాలు ప్రచురించడంతో పాటు, జాతీయ స్థాయి సదస్సుల్లో నాలుగు పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ తల్లా మల్లేశం చైతన్యను అభినందిస్తూ, తన కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు డా. తల్లా వంశీ, డా. తల్లా వరుణ్ పీహెచ్‌డీలు సాధించగా, ఇప్పుడు కోడలు కూడా డాక్టరేట్ పొందడం గర్వకారణమని తెలిపారు. ఈ విజయంతో తల్లా పద్మావతి విద్యాసంస్థలలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డా. తల్లా వంశీ, డా. తల్లా వరుణ్, టీపీసీఈ ప్రిన్సిపాల్ డా. ఆర్. వేళు, కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి, అధ్యాపకులు మరియు విద్యార్థులు డా. చైతన్యను అభినందించారు.

