Headlines

బాలు తో తెలంగాణ కు తగాదా ఏమిటి?

బాలసుబ్రహ్మణ్యం…
ఈయనతో తెలంగాణకు తగాదా ఏంలేదు.కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న ప్రజల ఆర్తి గీతమైన జయ జయహే' గీతాన్ని ఆయన పాడ నిరాకరించినప్పటినుండే ఆయనపై వ్యతిరేకత ప్రారంభమైంది. ఒక కళాకారుడిగా మతాలకతీతంగా ఆయన ఎన్నో క్రిష్టియన్ గీతాలను ఆలపించారు. ఆ విషయంలో ఆయన తాను ప్రొఫెషనల్ అని నిరూపించుకున్నారు.కానీ అదే ప్రొఫెషనలిజంతో తెలంగాణ గీతాన్ని మాత్రం పాడలేకపోయారు.ఇక్కడ ఆయన స్పష్టంగా తన ప్రాంతీయ స్పృహను చాటుకున్నారు.డబ్బులిస్తానన్నా మొహమాటం లేకుండా తిరస్కరించారు. తప్పులేదు..అది తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఆయనిచ్చిన గౌరవం..ప్రాంతాలకతీతంగా ఆయనిక్కడ నడుచుకోలేకపోయాడు. చెప్పాలంటే ఇక్కడ ఆయన తన ఆంధ్ర ప్రాంత అస్తిత్వాన్ని ఏ మాత్రం వదులుకోవటానికి ఇష్టపడలేదు. అది ఆయన ఇష్టం..ఆయన అభిప్రాయాన్ని మనం కూడా గౌరవిద్దాం. కానీ ఈ ప్రాంత ఉద్యమాల పట్ల, ఈ ప్రాంత అస్తిత్వం పట్ల ఈరకమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి విగ్రహం తెచ్చి ఈ గడ్డ నడిబొడ్డున ప్రతిష్టిస్తే ఇక్కడి ప్రజలు ఎలా హర్షిస్తారు, ఎలా గౌరవిస్తారు. శాంతి సమానత్వం కోసం కొట్లాడిన గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను అమెరికా, లండన్ లో పెట్టుకున్నారు, వారి ఆదర్శాలు ప్రపంచానికి అవసరం అని. అలాంటి సార్వజనీనమైన ఆదర్శం ఏదైనా బాలసుబ్రహ్మణ్యం పాటించాడా? అతని విగ్రహం ఈ గడ్డమీద ఎందుకు అనేవారి ప్రశ్నలకు ఎవరు బదులిస్తారు. ఉద్యమాల్లో లేనివారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అనేదానికి నిదర్శనమా ఈ నిర్ణయం. కళాకారులు కుల మతాలకు, ప్రాంతాలకు అతీతం అంటే..ఎప్పుడూ వాళ్ళు అలాగే ఉన్నారా? నిస్సందేహంగా లేరు..తామంతా తెలుగువాళ్ళం అనే సమభావనని వాళ్ళు వ్యక్తపరచలేదు. తాము ఆంధ్ర ప్రాంతీయులుగా ఆంధ్రకే ప్రాతినిధ్యం వహించారు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు, జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు..అప్పటి సినిమా రంగంలో అగ్ర తారలుగా వెలుగొందుతున్న N.T.రామారావు, కృష్ణ లాంటివాళ్ళు ఆంధ్రకే జై కొట్టారు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా, జై ఆంధ్రకు మద్దతుగా పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటనలిచ్చారు. ఏనాడూ తెలంగాణ పట్ల ఒక సానుభూతి వచనమైనా పలుకలేదు. ఇక్కడ కరువొస్తే పట్టించుకోని హీరోలు అక్కడ వరదలొస్తే మాత్రం జోలె పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగారు. అయినా అమాయకులైన తెలంగాణ ప్రజలు అందరూ మనవాళ్లే అనుకొని మెళ్ళోని గొలుసుల్ని కూడా వారి జోలెలో వేసారు, వారి సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలని పెంచారు. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇక్కడివాళ్లకు అవకాశాలు ఇవ్వకున్నా ఇప్పటికీ నైజాం మార్కెట్ తో ఇండస్ట్రీని బ్రతికిస్తున్నారు. తమ ఆటోల వెనుక హీరోల బొమ్మలేసుకుని మురిసిపోతున్నారు. అభిమాన సంఘాల పేరుతో పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూనే ఉన్నారు. తర్వాత కాలంలో నక్సలిజం తెచ్చిన చైతన్యాన్ని కూడా తమకోసం వాడుకోకుండా, N.T.రామారావును ముఖ్యమంత్రిని చేయటానికి వాడారు..ఇన్ని చేసినా కొందరు మేధావులు ఇక్కడివాళ్ళు సంకుచితంగా ఆలోచిస్తారని గొంతు చించుకుంటారు. తెలంగాణ ప్రజలు ఇంకేం చేస్తే సంతృప్తి కలుగుతుంది వీళ్ళకు. సినిమా రంగం పుట్టి ఇన్ని దశాబ్దాలైనా ఇప్పటికీ అదే తీరు. వారి వారసులది కూడా అదే దారి. సినిమా రంగం మద్రాస్ నుండి ఇక్కడికొచ్చినా వారి ధోరణి మారలేదు. ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడటానికి చవకగా స్టూడియోలకు భూములిచ్చినా, కట్టుకోవటానికి ఇండ్ల స్థలాలిచ్చినా తెలంగాణకు వీళ్ళు చేసింది శూన్యం. ఇవన్నీ భరించటం తెలంగాణ ప్రజల ఔదార్యం. వారు తిరగబడితే పరిస్థితి ఏమిటి..? ఇక్కడున్న ఆంధ్ర ప్రాంతీయుల విగ్రహాల్లో రెండో వంతైనా ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు పెట్టలేదు..అందరూ ఒక్కటే అయితే ఇప్పటికైనా అమరావతిలో ఇక్కడి మహనీయుల విగ్రహాలు పెడతారా? ఈ వన్ సైడ్ లవ్ ని ఎలా సమర్థిస్తారు.. ఈ దేశ పౌరులు ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఎక్కడైనా స్థిరపడొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు..అక్కడివాళ్ళ సినిమాలను ఇక్కడివాళ్ళు చూడొచ్చు, ఇక్కడివాళ్ళ సినిమాలు అక్కడివాళ్ళు చూడొచ్చు..కానీ ఒక ప్రాంతానికి తనదైన అస్తిత్వం ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే అగ్ని పర్వతం బద్దలవుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో జరిగింది అదే, ఇప్పుడూ జరుగుతున్నది అదే. ప్రభుత్వంలో భాగమై కూడా కోదండరాం లాంటివాళ్లు, విద్యార్థి ఉద్యమాల్లో నుండి వెళ్లినవాళ్లు దీనిపై ఎందుకు స్పందించటం లేదో అర్థం కావటం లేదు.. కేసీఆర్ పాలనలో ఆయన చేసిన అవినీతి సంగతి పక్కన పెడితే ఎంతో కొంత తెలంగాణ స్పృహతో వ్యవహరించాడనేది నిజం. కేసీఆర్ చేసిన తప్పుల్ని ఒక్కొక్కటీ లెక్కించిన తెలంగాణ ప్రజలు ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. సహజంగా అధికారంలో ఉన్నవాళ్లకు కళ్ళు నెత్తికెక్కుతాయంటారు. సరైన సలహాలు చెప్పేవాళ్ళు లేక, ఒకవేళ చెప్పినా వినిపించుకోనప్పుడే ఇలాంటి నిర్ణయాలు బయటికొస్తాయి. పదేళ్లు అధికారంలో ఉంటానని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి తన పతనానికి తానే ఇటుకలు పేర్చుకుంటే చేయగలిగింది ఏమీలేదు. తెలంగాణలో ఇప్పుడు పోరాటాలు లేకపోవచ్చు. లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో నక్సలిజం పలుచబడొచ్చు. కానీ ఇక్కడి ప్రజల్లో చైతన్యం ఇంకా మిగిలే ఉంది. అది ఉండటం వల్లనే అపర చాణుక్యుడైన కేసీఆర్ ను కూడా ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. చరిత్ర ఎప్పుడూ పునరావృతమవుతుంది.అది మర్చిపోకూడదు. రేపు వేరేవాళ్లు అధికారంలోకొచ్చి ఆ విగ్రహాన్ని ప్యాక్ చేసి ఆంధ్రాకి పంపితే అది బాలు గారికి మరింత అవమానం. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి. వ్యక్తిగతంగా నేను బాలసుబ్రహ్మణ్యం గారికి, సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిని. ఘంటసాల గారు గొప్ప గాయకుడే, కానీ ఎందుకో నాకు బాలు గారి గాత్రం అంటేనే ఇష్టం. ఆ ఇష్టంతోనే పట్టుబట్టి నా మొదటి సినిమానగరం నిద్రపోతున్న వేళ ‘లో `నిద్రపోతున్నది పట్నం’ అనే పాట పాడించాను. చెన్నైలో బాలు గారు ఆ పాట పాడుతున్నప్పుడు అప్పుడే వచ్చిన కొత్త సింగర్ లా పాట గురించి నోట్స్ వ్రాసుకోవటం, ఓకేనా మళ్ళీ పాడాలా అని పదే పదే అడగటం నాకు ఇప్పటికీ గుర్తుంది..ఒక కళాకారుడిగా ఆయన కళకు శిరస్సు వంచి నమస్కరిస్తాను.అది వేరు..
అభిమానం వ్యక్తిగతం..ఒక ప్రాంతం మనోభావాలను గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. అది రేవంత్ రెడ్డి అయినా, మరొకరైనా ఫరక్ పడదు..తెలంగాణ సెంటిమెంట్ ను అవమానిస్తే ఎవరినైనా బండకేసి కొడుతుంది తెలంగాణ…!
తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారూ!!

From Premraj Enumula FB Wall

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు