ములుగు జిల్లాలో వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎదురైన అవరోధాలను మంత్రి సీతక్క పట్టుబట్టి సాధించారు.
బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న అటవీ చట్టాల అడ్డంకులు తొలగించి, రోడ్ల నిర్మాణం నుండి వైద్య సేవల వరకు అనుమతులు సాధించారు మంత్రి సీతక్క. రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూర్య సీతక్క కృషితో ఇవన్ని సాధ్య మయ్యాయి.
ఇదేమంత ఘనకార్యం కాదని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అటవి ప్రాంతాల్లో ప్రత్యేక చట్టాలు ఉంటాయి.
రోడ్డువేయాన్నా లేక ఏదైనా నిర్మాణం చేపట్టాలన్నాప్రత్యేక అటవి చట్టాల కారణంగా అనుమతులు లభించవు.
సీతక్క మంత్రిగా తనకు అందివచ్చిన అవకాశాల మేరకు అన్ని ప్రయత్నాలు చేసి అడ్డంకులు తొలగించేందుకు అందరిని ఒప్పించి అనుమతులు సాధించారు.
దీంతో ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమమైంది. కంతనపల్లి, కొండపర్తి, కొడిశెల, ఐలాపురం, పాకాల, దుబ్బగూడెం వరకు కొత్త రోడ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఇవి గిరిజన ప్రాంతాల రవాణా సౌకర్యానికి ఎంతగానో తోడ్పడనున్నాయి.
పాకాల కొత్తగూడెంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి క్లియరెన్స్ లభించింది. దీంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ, తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక సఫారీ వాహనాలు మంజూరు చేయించారు సీతక్క.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు, వైల్డ్‌లైఫ్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన సీతక్క, తన నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కావాలనే బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.