ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు



*
‘వుమెన్ ఎంపవర్ మెంట్’ ఇంటి నుంచే మొదలవ్వాలి
*
‘వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుక’లో మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యసాధనలో మహిళలను కీలక భాగస్వామ్యం చేస్తామన్నారు. ‘వీ హబ్’ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్ లోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వీ – ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుక’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలన్నారు. ఇప్పుడిప్పుడే… సమాజంలో ప్రగతిశీల మార్పు కనిపిస్తుందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. 2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 22 శాతం నుంచి 40.3 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతం అని, ఇది జాతీయ సగటు 45.2 శాతం కంటే ఎక్కువగా నమోదు కావడం రాష్ట్ర పురోగతిని ప్రతిబింబిస్తోందన్నారు. మహిళలు కూడా పురుషులకు ధీటుగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా నిర్వహించగలరని ‘వీ హబ్’ నిరూపించిందన్నారు. ఈ స్ఫూర్తితో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించే సార్టప్స్ ను అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్ ప్రైజెస్ గా మార్చేలా ‘వీ హబ్ 2.o’కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ వేదిక ద్వారా ఒకేచోట స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్, మెంటార్షిప్ అందుబాటులో ఉండేలా ‘ఎకో సిస్టం’ ను అభివృద్ధి చేస్తామన్నారు. మహిళల ఆలోచన తీరులోనూ మార్పు రావాలని, ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించేలా కొత్తగా ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారిణి జ్వాల గుప్తా, ఫిలిం ప్రొడ్యూసర్ ప్రియాంక దత్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోల్ల తదితరులు పాల్గొన్నారు.

