ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింటి కలహాలతో విసిగిపోయిన ఓ యువతి, తన భర్తతో సహా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసేందుకు దుర్మార్గమైన పథకం రచించింది. కరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కియా బాజా ఖుర్రామ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మాల్తీ దేవీ అనే యువతి, అత్తమామలు, భర్తతో రోజూ జరిగే తగాదాలతో మానసిక హింసకు గురై, కుటుంబాన్ని అంతం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆమె తన తండ్రి ప్రసాద్, సోదరుడు బజరంగీలతో కలిసి ఈ కుట్ర పన్నింది. ఒక రోజు, గోధుమ పిండిలో సల్ఫోస్ అనే విషపూరిత రసాయనాన్ని కలిపి చపాతీలు తయారు చేయడం ప్రారంభించింది. అయితే, ఆమె వదిన మంజూ దేవీ పిండి నుంచి వింత వాసన రావడం గమనించి, అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో అత్తమామలు మాల్తీని నిలదీయడంతో, ఆమె కుటుంబం మొత్తాన్ని చంపేందుకు విషం కలిపినట్లు అంగీకరించింది.
మాల్తీ భర్త బ్రిజేష్ కుమార్ వెంటనే కరారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి మాల్తీ, ఆమె తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. విషం కలిపిన గోధుమ పిండిని స్వాధీనం చేసుకుని, హత్యాయత్నం, నేరపూరిత కుట్రకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. కుటుంబ కలహాలు ఇంతటి దారుణమైన నిర్ణయాలకు దారితీస్తాయని గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. మాల్తీకి ఆమె వదిన, అత్తమామలతో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.
కౌశాంబిలో దారుణం: మొత్తం కుటుంబాన్నే లేపేయానుకుంది-చపాతి పిండిలో విషం కలిపింది
