(తెలుగుగడ్డపై
మొదటిసారిగా
వితంతువు
వివాహం జరిగిన రోజు
11.12.1881)
మగవాడెంతటి ముసలాడైనా
మళ్ళీ పెళ్ళికి అర్హత ఉంటే
బ్రతుకే తెలియని బాలవితంతువుకెందుకు
లేదా హక్కంటాను..
ఇలా అడిగి..
ప్రశ్నించి..నిలదీసి
ఊరుకోలేదు కందుకూరి..
తాను స్వయంగా నడుం కట్టి
తన ఇంటనే వెలిగించాడు
మొదటి జ్యోతి..
ఓ బాలవితంతు వివాహం..
తంతు కాదది..
ఓ గొప్ప క్రతువు!
ఇదంతా జరిగింది ఎప్పుడు..
ఆడది బయట
కాలు పెట్టడానికే
ఎన్నో ప్రతిబంధకాలు
ఎదుర్కొంటున్న
ఛాందస కాలంలో..
పెళ్లయి బొట్టు చెదరిన స్త్రీ
ఎంత చిన్నదైనా గాని..
మళ్ళీ పెళ్లి ఆలోచన కూడా
చెయ్యరాదన్న
నిబంధనల సంకెళ్లు
వేధించే మూర్ఖ సమాజంలో..
తన వాకిట్లో వేయించి పందిరి..
ఎన్నెన్ని బ్రతుకుల్లోనో
వైధవ్య చీకట్లు తొలగించే
గొప్ప సంస్కరణకు శ్రీకారం..
ఒక మహాసంగ్రామానికి
అదే నుడికారం..!
ఇదేమంత అలవోకగా
జరిగిన శుభకార్యం కాదు..
అంతకు చాలా ముందు
రాజారామ్మోహన్ రాయ్
చేసిన గొప్ప సమరం..
ఆగింది సతీసహగమన
దురాచారం..
సంస్కరణలకు శ్రీకారం..
నాటి సమాజంలో
పెను దుమారం..
నెలతకు తప్పిన పెద్ద కలత..!
కొనసాగింపుగా ఈశ్వర చంద్ర
వితంతువు జీవితంలో
నింపిన వెన్నెల వెలుగు..
దేశంలోనే మొదటి
వితంతు వివాహం..
పాలబుగ్గలారని తారసుందరి
(వయసు పద్నాలుగు)
మెడలో తాళి..
భయంకరమైన దురాచారానికి
ఎగతాళి..!
ఇది జరిగింది బెంగాల్లో..
డిసెంబర్ 7..1856 లో..!
పాతికేళ్ల తర్వాత..
తెలుగునాట తొలి పెళ్లి..
వితంతువు గౌరమ్మకు
(వయసు తొమ్మిదేళ్లు)
వివాహం..
అణచివేస్తూ
ఛాందసవాదుల అహం..!
వితంతు వివాహం
శాస్త్ర సమ్మతమే అని
పరిశోధనల ద్వారా నిరూపించిన వీరేశలింగం..
సలాము చేసింది నాడే
ఆ మహనీయునికి
అభ్యుదయ జగం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286

