గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (జీజీహెచ్) సేవలపై వస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రమణ మంగళవారం రాత్రి ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. వృద్ధుడి వేషంలో, ఇద్దరు సహాయకులతో కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్నారు.
చింపిరి జట్టు, పాత చొక్కా, మాసిన కండువా, చేతిలో కర్ర, ముఖానికి మాస్క్ ధరించి చేతికర్ర ఊతంతో నడుస్తూ మారు వేషంతో వచ్చిన ఆయనను ఎవ్వరూ గుర్తించలేదు. వైద్యులు సాధారణ రోగిగా భావించి పలు పరీక్షలకు రిఫర్ చేశారు. అనంతరం ఆయన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను వరుసగా సందర్శించారు.
వరండాల్లో తిరుగుతున్న శునకాలు, ఐసీయూ వద్ద డ్యూటీ సిబ్బంది స్పందన, ఔషధశాల వద్ద పరిస్థితి వంటి అంశాలను స్వయంగా గమనించారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రి చుట్టూ తిరిగి సేవల స్థితిని పరిశీలించారు.
తరువాత అసలు విషయం తెలిసి సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గత కొంతకాలంగా రాత్రివేళ ఆర్‌ఎంవోలు, వైద్యులు అందుబాటులో లేరన్న ఫిర్యాదులు రావడంతో ఈ ప్రత్యేక తనిఖీలకు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో కొన్ని లోపాలు బయటపడ్డాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

