లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – సరెండర్ పాలసీపై కీలక చర్చలు

Maoists

లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – సరెండర్ పాలసీపై కీలక చర్చలు

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయిన పలువురు మాజీ మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సహాయం, పునరావాస చర్యలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో మాజీ మావోయిస్ట్ నాయకులు తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలసీని ప్రశంసించారు. ఆధునిక ప్రపంచంలో తుపాకీ సిద్ధాంతానికి స్థానం లేదని, ప్రజల్లో అవగాహన కల్పించి మావోయిస్టులను ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. జైళ్లలో ఉన్న మావోయిస్టులను కూడా కలసి, లొంగుబాటుకు ప్రోత్సహిస్తామని వెల్లడించారు.

మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల అమలు, వారి భవిష్యత్ జీవనోపాధి వంటి అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కగార్”ను కొనసాగిస్తోంది. అడవుల్లో ఉన్న మావోయిస్టులను లొంగిపోవాలని పిలుపునిస్తూ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు కూడా లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్ట్ పార్టీకి చెందిన మాజీ అగ్రనేత దేవ్‌జీతో పాటు నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్న తదితరులు లొంగిపోయారు.

సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన దేవ్‌జీ, సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతికి కృతజ్ఞతలు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందించే రివార్డు మొత్తాన్ని రూ.1 కోట్లకు పెంచాలని, అలాగే పునరావాసం కోసం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఐదు ఎకరాల భూమి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేమ్ నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

లొంగుబాట్ల ద్వారా మావోయిస్టులను ప్రధాన ప్రవాహంలోకి తీసుకువచ్చి, శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల