Headlines

విప్లవోద్యమంపై విశారదన్ విషపూరిత వ్యాఖ్యలు

శత్రువెవరో మిత్రువెవరో తెలిసి మసులుకుంటే మంచిది

మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం తెలియకుంటే విషాదమే

బి.సి ఉద్యమ వేదికలపై విశారధన్ బాషా పాండిత్యం ఎటుపోతుంది?

పూలన్ దేవికి ఒక గొప్ప ప్రపంచం మేధావి ఎదురై ఓటు హక్కు ద్వారా ఠాగూర్లను ఎదుర్కోవాలి అని చెప్పి ఉంటే ఆయన పరిస్థితి ఏమిటో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. స్వతంత్ర దేశంలో ఠాగూర్ల అత్యాచారానికి గురైన పూలన్ దేవి తన ముందున్న పరిష్కారం ఒక్కటే అని నమ్మింది. తుపాకీ పట్టడం ఠాగుర్ల పని పట్టడం. తను అనుకున్నది సాధించగలిగింది. పిడుగుకి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చాకే భూస్వాముల, పెత్తందారుల దుర్మార్గాలు, అత్యాచార పరిస్థితులు ఉంటే స్వాతంత్రం రాకముందు ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. భూస్వాముల పెత్తందారుల ఆగడాలు, అత్యాచారాలు దేశంలో పెచ్చరిల్లిపోతున్న వేల మార్క్స్ సిద్ధాంతం వెలుగులో రెండు ప్రపంచ మహా విప్లవాలు జరిగినాయి. వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేశానని గొప్పలు చెప్పేవారు ఆనాటికి పుట్టివుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. విప్లవాలను కుట్రలని భావించేవారు సిగ్గుపడాలి. పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించినట్టు వీరి పరిస్థితి వుంది. విశారదన్ పిచ్చిపిచ్చి ఉపన్యాసాలతో ప్రేలాపనలతో విప్లవోద్యమాల మీద దుష్ప్రచారాన్ని కొనాగిస్తున్నాడు. విశారదన్ లాంటి వారందరికి సమాధానమే ఈ వ్యాసం.

కారంచేడు, చుండూరు, పదిరకుప్పం, నీరుకొండ, చీమకుర్తి దళితుల మీద ఎన్నో దాడులు ఇవన్నీ మన జీవిత కాలంలోనే చూసినం. చుండూరులో జరిగిన సంఘటన తెల్లవారే సిద్దిపేట దగ్గర చిన్నకోడూరు మండలం రామన్నపల్లిలో దళితులపై దాడులకు జరిగిన కుట్రను భగ్నం చేసినం. రెడ్డీలను నేను నా దళంతో కలిసి ముక్కు నేల రాయించినం. చిన్న కోడూరు మండలంలోని సికింద్లాపురం గ్రామంలో రజక కుటుంబంపై దాడి చేసిన రెడ్డిలను ప్రజాకోర్టులో శిక్షించినం. మల్లాపూర్లో పుల్లర పేరిట దసరా రోజున బలవంతంగా గొర్ల మేకలను తీసుకుపోతుంటే రెడ్డిలను తరిమికొట్టినం. దర్గపల్లిలో పెత్తందారుల కుట్రతో రెండు గ్రామాల ప్రజలు కొట్టుకుని చావడానికి సిద్దమైతే ఆపిననం. సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాలలో విప్లవ పార్టీల నాయకత్వంలో వేలాది ఎకరాలను భూమిని భూస్వాములను చర నుంచి విడిపించుకుని ప్రజలు పంచుకున్నారు. నాడు ప్రాణమివ్వడానికి సిద్ధమైతే తప్ప దళం కడితే తప్ప, శత్రువు చేసే దాడులనుండి తప్పించుకోవడానికి వీలులేదు. రహస్య ఉద్యమంలో రాత్రనక, పగలనక, పురుగు పుట్రనక నడిస్తే (ఈయన భాషలో పాదయాత్రలు) చేస్తేనే విప్లవం వర్ధిల్లి ప్రజలు విముక్తి చెందారు. విశారదన్ యాత్రలో చిలుక పలుకులే కానీ పాదయాత్రలు లేవు. విప్లవకారులు సోకుతో తుపాకులు పట్టుకొని తిరగలేదు. ఆత్మగౌరవపు తిరుగుబాటు అది. భూస్వామికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుంటే దొర గుండాలు చేసిన కాల్పులలో దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. అతని అమరత్వాన్ని గానం చెయ్యడం తప్పా. పూలే అంబేద్కర్ లను తెలుసుకుంటే పీపుల్స్ వార్ నిప్పు పెట్టి వస్తారు లాంటి మాటలు చూస్తుంటే విశారదన్ సోయిలో వుండే మాట్లాడుతున్నారా అనే సందేహం కలుగుతుంది.
విప్లవోద్యమాల ప్రభావం, ఒత్తిడితోనే పాలక ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారనే సత్యాన్ని కాదనలేం. సరే ఇవాళ విప్లవోద్యమం తీవ్ర నిర్బంధాల వల్ల సంక్షోభాలు ఎదుర్కోవచ్చును, యుద్ధంలో ఓడిపోవచ్చు. అవకాశం దొరికింది కదా అని చిల్లర మాటలతో విప్లవోద్యమాన్ని గాయపరచడం సరికాదు. ఊరికే కూసున్నోడికి ఉపాయం ఎక్కువ అన్నట్లు ఉపన్యాస కళ కూడా ఎక్కువే. ఇటువంటి ఉపన్యాస కళను ఉపయోగించి పూలే, అంబేద్కర్ లని అడ్డం పెట్టుకొని బి.సి ఉద్యమ వేదికల మీద విప్లవోద్యమంపై దాడి చేయడం దుర్మార్గం. పాలకవర్గ కులాల చర్మం మందంగా ఉంటుంది కనుక గుల గుల పెడితే గోకినట్టుగా విశారదన్ మాటలు వారికి హాయిగా ఉంటాయి. విప్లవోద్యమం పట్ల తను చేసే వ్యాఖ్యలు పాలకుల చెవులకు ఇంపుగా ఉంటాయి. ఈయన ఉపన్యాస కళతో, బాషా పాండిత్యంతో పాలకులకు జరిగే నష్టం ఏమి లేకపోగా విప్లవోద్యమానికే నష్టం. కాబట్టి విశారదానికి పాలకులు ఎటువంటి హాని చేయకుండా వుంటారు. కాని విప్లవ అభిమానులకు, శత్రువు దాడితో తనువు, మనసు నిలువెల్ల గాయాల పాలై పుండైన విప్లవకారుల మనసును, శరీరాన్ని తన మాటల ఈటెలతో గాయపరచడం వల్ల వేదనకు గురిచేస్తుంది. దీనితో విశారధానికి పైశాచిక ఆనందం తప్ప ఏం మిగులుతుంది.
మార్క్స్ సిద్ధాంత వెలుగులో ప్రపంచంలో రెండు పెద్ద దేశాల్లో మహా విప్లవాలు జరిగినాయి. లెనిన్ నాయకత్వంలో రష్యా, మావో నాయకత్వంలో చైనా ప్రపంచ పీడిత ప్రజలకు స్ఫూర్తినిచ్చినాయి. ఆ ప్రభావం ఇండియా మీద తెలంగాణ గడ్డమీద కూడా పడింది. మార్క్స్ సిద్ధాంతాన్ని తక్కువ చేయడానికి మన దేశంలో పుట్టిన మహనీయులు బుద్ధున్ని, సంత్ రవిదాస్, కబీర్, మహాత్మ జ్యోతిబాపూలే అంబేడ్కర్లను పోటీ పెట్టి దాడి చేయడం సరికాదనే వాస్తవాన్ని గుర్తించాలి. దేని శక్తి దానిది. మార్క్సిజమ్ అగ్రకులాల వ్యక్తులను కూడా ప్రభావితం చేయడంతో వారు పీడితులకు అండగా నిలబడ్డారు. వారితో పీడితులు కలిసి నడిచారు. వారు వీరు సహవాసం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నారు. కలిసి సంసారం చేశారు. ఉద్యమంలోనే చనిపోయారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారు. కొనసాగింపుగా వచ్చిన నక్సలైట్ ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని ఎత్తిపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన వల్లనే బహుజన, రాజకీయ అస్తిత్వ పోరాటాలకు వెసులుబాటు దొరికిందనే వాస్తవాన్ని మరచిపోరాదు. యాద్రుచ్చికంగా విప్లవోద్యమ నిర్మాణంలో కూడా అప్పటికి సమాజానికి ప్రతిబింబమా అన్నట్టు నిర్మాణం అయ్యింది. ఆధిపత్య కులాల నుండి విప్లవోద్యమంలోకి వచ్చిన వ్యక్తుల తెలివిడి అంతే, ప్రజల తెలివిడి అంతవరకే. వారు పూలే అంబేడ్కర్ ను తెలుసుకోలేకపోయారు నిజమే కావచ్చు కానీ అది కుట్ర కాదు. విశారదన్ కళ్ళకి ఇది కుట్రగా కనబడుతుంది. ఆనాటికి విశారదన్ పుట్టి లేడు. పుట్టి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో ఎవరు చెప్పగలరు.
యాదృచ్ఛికంగానే అయినా బయట సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల నిర్మాణాలే కమ్యూనిస్టు విప్లవోద్యంలోనూ ఉండడం వల్ల విప్లవోద్యమం దెబ్బతింటుందని గుర్తించిన మారోజు వీరన్న, వర్గ కుల సిద్ధాంతానికి రూపకల్పన చేశాడు. రహస్య పార్టీ, ఐక్య సంఘటన, ఎర్రసైన్యం నిర్మాణం కోసం కట్టుబడి వున్నాడు. విశారదన్ చెపుతున్నట్టు వీరన్న ఎన్నికల్లోకి వచ్చేవాడు కాదు. అయితే ఎన్నికల రంగంలో కూడా బలమైన యుద్ధం జరుపాలని ఆశించాడు. కులమైనా వర్గమైనా బల ప్రయోగంతో వచ్చినదేది బలప్రయోగంతోనే వదిలిపోతుందని చెప్పాడు. అయితే అప్పటివరకు పార్లమెంటును పందుల దొడ్డి అని ఎన్నికలు బహిష్కరించాలనే విధానాలను తప్పు పట్టాడు. జూదం నుంచి యుద్ధం వరకు ప్రతి రంగాన్ని యుద్ధరంగంగా మార్చాలన్నాడు. రహస్య పార్టీగా ఉంటూనే ఎన్నికల రంగంలో యుద్ధం చేయడానికి ఒక ఎన్నికల పార్టీని ఊ సాంబశివరావు అధ్యక్షుడిగా ఏర్పాటు చేయాలని భావించాడు. ఆ క్రమంలోనే మహాజన ఫ్రంట్ ఏర్పడింది. తర్వాత ఊ సాంబశివరావు, మహాజన పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. 1999 మే 16 న చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బలి తీసుకుంది. వీరన్న గురించి విప్లవోద్యమాల గురించి ఎబిసిడిలు కూడా తెలియని విశారాధన్ వీరన్న బతికి ఉంటే ఏం చేసేవారో సెలవిస్తున్నాడు. వీరన్న చూపిన దిశలో జరిగిన పయనం జంబూద్వీపాన్ని ముందుకు తెచ్చింది. యుద్ధంలో గెలుపు ఓటములు సహజమే. వీరన్న ఉద్యమ సహచరులుగా మేము ఏ అంశాలను ముందుకు తెచ్చామో వాటిని విశారదన్ మోసుకుంటూ తిరుగుతున్నాడు కదా అని సంతోషించాం. మొదట్లో ఈయన విప్లవోద్యమం పట్ల అసంతృప్తి వెళ్ళబుచ్చినప్పుడు బిడ్డకు వయస్సుతో పాటు జ్ఞానం పెరుగుతుందిలే అనుకున్నాం. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు పిచ్చి జ్ఞానం పెరిగి పెచ్చరిల్లి పోతుంది.
ఈయన చెబుతున్న ఆదర్శాలు సిద్ధాంతాల పాటింపు ఏ పాటిదో కూడా చూద్దాం. మాట మాట్లాడితే పూలే అంబేడ్కర్ కాన్షీరాం లను నా మార్గదర్శులంటాడు. చదువుకోవాలని మాటల వరకు గొప్ప మాటలు చెబుతాడు. మహనీయుల విలువలను ఆదర్శాలను సిద్ధాంతాలను ఏమైనా పాటిస్తుండా అంటే అది లేదు. ఉత్తరప్రదేశ్ లో చాలా గ్రామాలలో అక్షరం ముక్క రాని దళిత వాడలు రాష్ట్రమంతటా ఉన్నాయి. అక్కడికి వెళ్లి పిల్లలకు చదువు నేర్పాలని ఆలోచన రాదు. దండకారణ్యంలో ఈయనకు చేయాల్సింది ఏమి కనపడలేదు. మహాత్మ జ్యోతిబాపూలే ఒకనాడు మహారాష్ట్రలో మహిళల కోసం బడులు పెట్టిండు, హైదరాబాదులో భాగ్యరెడ్డి వర్మ ఉత్తరప్రదేశ్ లో విశారదన్ కంటే కూడా చిన్నవాడు చంద్రశేఖర్ ఆజాద్ బడులు స్థాపించాడు. విశారదన్ దున్నిన కాడనే దున్నడం తప్ప ఉత్తరప్రదేశ్ వెళ్లి బడులు స్థాపించలేకపోయాడు.
ప్రపంచంలో ఎక్కడా లేని దుర్మార్గం ఈ దేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. దీన్ని కదిలించడానికి మనసా వాచా కర్మేనా ఆచరించిన వారే మహనీయులు. అటువంటి మహనీయుల ఆలోచన విద్య. ఆ విద్య కోసం విద్య లేని వారికి నేర్పడానికి ఈయన ఉత్తరప్రదేశ్ ఎందుకు వెళ్లలేకపోయాడు. వారితో తనను పోల్చుకోవడానికి ఏమాత్రం అర్హతలు ఉన్నవాడు కాదు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రాన్ని, ఉద్యోగం చేసిన మహారాష్ట్రను వదిలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి బహుజన ఉద్యమ నిర్మాణనానికి పూనుకున్న మహనీయుడు కాన్సీరాం. తనది కాని రాష్ట్రం, అగ్రకుల రౌడీలకు నిలయం ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ అక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటమే. ప్రాణం ఇవ్వడానికి సిద్దమైతే తప్ప సమాజంలో ఒక చిన్న కదలిక కూడా జరుగదు. ఇక ఉద్యమ ప్రారంభకుల జీవితం నిప్పుల మీద నడకలా ఉంటుంది. వారి జీవితం చిద్రం అవుతుంటుంది. మహనీయులు కాన్షీరామ్ పంజాబ్ లో పుట్టి పెరిగాడు. మహారాష్ట్రలో మంచి ఉద్యోగం వచ్చింది. పూణే నగరంలో అంబేద్కర్ ను తెలుసుకున్న మరు క్షణం అంబేద్కర్ ఆశయ సాధన కోసం తనను తాను అర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. తన తల్లిదండ్రులకు తనను మర్చిపోవాలని ఉత్తరం రాశాడు. పెళ్లి చేసుకోకుండా సమాజ పరివర్తనకే తన జీవితాన్ని అంకితం చేశాడు. అంతటి మహనీయుడు తాను పుట్టిన పంజాబు లో లేదా తాను ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలో గాని ఉద్యమం చేయలేదు. దేశంలోనే అత్యంత దుర్మార్గంగా ఉన్న నిచ్చెనమెట్ల వ్యవస్థ కేంద్రీకరించబడి ఉన్న ఉత్తరప్రదేశ్ కి వెళ్ళిపోయాడు. చేగువేరా తన దేశాన్ని విముక్తి చేసి మరో దేశానికి వెళ్లినట్టు. కాన్షీరామ్ తన అవసరం ఎక్కడుందో వెతుక్కుంటూ అక్కడికి వెళ్లాడు. విశారదన్ కు అలాంటి చరిత్ర ఏది లేదు. తన తల్లిదండ్రులను వదులుకోలేదు. కుటుంబ జీవితాన్ని వదులుకోలేదు. తన పుట్టిన రాష్ట్రాన్ని వదులుకోలేదు. విశారధన్ కు తన వివాహానికి ముందే కాన్సీరాం చరిత్ర తెలుసు. వివాహం చేసుకోకుండా ఉన్న కాన్సీరాం ఈయనకు ఎర్రిబాగులోని లెక్క కనిపించి ఉంటాడు. కాన్షీరామ్ లాగా విశారదన్ వివాహం చేసుకోకుండా ఉండలేకపోయాడు. పిల్లలను కనుకుండా ఉండలేకపోయాడు. ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా లేనని తనకు తానే గర్వంగా ప్రకటించుకుంటాడు. అంబేద్కర్ అధ్యయనం, పరిశోధన, పోరాటాలలో పడి తన బిడ్డలకు కూడా పోషకాహారం అందించలేనంతగా తనను తాను అర్పించుకున్నాడు. పూలే దంపతులు, పెరియార్ దంపతులు బిడ్డల్ని కనకుండా ప్రజల్ని తమ బిడ్డలుగా భావించి పోరాటం చేశారు. బహుశా విశారదన్ దృష్టిలో అనవసర త్యాగాలే అయివుంటాయి. కమ్యూనిస్టు విప్లవోద్యమంలో కూడా ఇలాంటి ఎందరో త్యాగదనులు జీవితాలను అంకితం చేశారు.
చివరగా నేను చెప్పేదేమంటే ఎవరు నమ్మే సిద్ధాంతాన్ని వారు ప్రచారం చేసుకునే హక్కు ఉంది. వారి వేదికలపై లేదా వారి అంతర్గత సమావేశాలు చర్చించుకోవడం వారి హక్కు. బి.సి వేదికల మీద బి.సి రిజర్వేషన్ మీద, బి.సి రాజ్యాధికారం మీద చర్చ జరగాలి. అందుకు బిన్నంగా విశారదన్ మాటల తూటాలు పిలుస్తున్నాడు. బి.సి లకు రాజ్యాధికారం అంటూనే కాపులు బి.సి లు కాదని వారిపై విమర్శలు, బి.సి రిజర్వేషన్ల బిల్లు పెట్టిన రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, త్యాగాలు చేసిన విప్లవ శ్రేణులను తప్పుగా మాట్లాడడం చూస్తుంటే బి.సి లకు తీవ్ర నష్టం చేసే ఉద్దేశంతోనే బి.సి ఉద్యమాల్లోకి చొరబడ్డడా అనిపిస్తుంది. మేము మాదిగ దండోరకు మద్దతుగా కార్యక్రమాలు, క్రియాశీల మద్దతు ఇచ్చినం. కానీ మాదిగ దండోరాను డామినేట్ చేయలేదు. దాంట్లో నాయకత్వం తీసుకోలేదు. బి.సి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మారోజు వీరన్న నుండి ప్రారంభమైన కృషిని నేటికీ కొనసాగిస్తూనే ఉన్నాం. ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మేము పాదయాత్రలు, సైకిల్ యాత్ర చేసినం. శాంతియుత ఉద్యమంలో అత్యున్నత పోరాట రూపమైన ఆమరణ దీక్షలు కూడా చేసినం. బి.సి ఉద్యమానికి మద్దతుగా విశారదన్ రావడానికి అభినందించాల్సిన విషయమే. అయితే అనేక సంస్థలు శక్తులు ఒక వేదికగా ఏర్పడి జరిపే సభలలో అనేక భావజాలాలు కలిగిన వ్యక్తులు శక్తులు పాల్గొంటారు. కామారెడ్డి సభలో వీరన్న అభిమానులు, విమలక్క ఇతర విప్లవ అభిమానులు ఎంతోమంది పాల్గొన్నారు. అక్కడ వారు గొడవ పడితే బి.సి ఉద్యమానికే నష్టం కనుక మౌనం వహించారు.
బి.సి ఐక్య వేదికలలో ఎంతోమంది వక్తలు ఉంటారు. అందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. ముఖ్య అతిథి చివరగా మాట్లాడటం ఆనవాయితీ. కొంచెం ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. అయితే బి.సి వేదికలకు సహజంగానే బి.సి ఉద్యమకారులే ముఖ్యఅతిథిగా ఉండాలి. కాని విశారదన్ ముఖ్య అతిథి అవుతున్నాడు. సమయం లేదు, సమయం లేదు అంటూ రెండు నిమిషాలు, ఐదు నిమిషాలు పరిమితి విధించుకుంటూవస్తున్న నిర్వాహకులు చివరగా విశారదన్ ను గంటన్నర సేపు మాట్లాడించారు. సిద్ధాంతాల నుండి మొదలై మిత్రులు, శత్రువులు, వ్యూహాలు అన్నిటినీ కలిపి కొట్టిన కావేటి రంగడు అయ్యాడు విశారదన్. విశారదన్ కు శత్రువు ఎవరో మిత్రువు ఎవరో తెలిసినట్టు లేదు. శత్రు వైరుధ్యం, మిత్ర వైరుధ్యం మధ్య తేడా తెలిసినట్లు లేదు. అసలు సమస్య ఏమిటంటే అగ్రకులాల నుండి కవిత దళిత సోదరుల నుండి విశారదన్ బి.సి ఉద్యమంపై జులుం చేస్తున్నారు. బి.సి వేదికలపై నుండి విప్లవోద్యమంపై దాడికి పూనుకుంటున్నారు. విప్లవోద్యమానికి బి.సి ఉద్యమానికి వైరుద్యం సృష్టించే ప్రయత్నం మంచిది కాదు. దీన్ని ఆ వేదిక నిర్వాహకులు గుర్తించాల్సి ఉంటుంది. పిడికెడు మందిని కదిలించగలడని వారిని నెత్తిమీదకి ఎత్తుకుంటే బి.సి ఉద్యమానికి తీవ్ర నష్టం జరుగుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. మద్దతుగా ఎవరు చేయగలిగేది వారు చేయనీయండి. భవిష్యత్తులో బి.సి వేదికల మీద పాండిత్య ప్రదర్శనకు అవకాశం ఇవ్వకుండా బి.సి అంశాలపై మాత్రమే చర్చ జరగాలని ఉద్యమకారులు గమనించాల్సిన అవసరముంది. 100 కులాలుగా, 100 వర్గాలుగా, 100 ప్రాంతాలుగా విడిపోయి అనైక్యతకు గురైన బి.సి ప్రజలు రాజకీయ పార్టీలకు బానిసలుగా జీవిస్తున్న నేటి తరుణంలో సకల సామాజిక రంగాల్లో బి.సి వాటా కోసం ఉద్యమాలు క్రమ పద్ధతితో పాటు క్రమ శిక్షణతో జరగాల్సిన అవసరముంది. ఇలాంటి కీలక దశలో బి.సి ఉద్యమానికి విశారదన్ లాంటి వాళ్ల మద్దతు బయటనుండి తీసుకోవడం మంచిది.

..బత్తుల సిద్దేశ్వర్ పటేల్
జాతీయ అధ్యక్షులు
హిందూ బి.సి మహాసభ
9704672813

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు