మూసీ ప్రక్షాళనపై సమగ్ర ప్రణాళిక-సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం: మూసీ ప్రక్షాళనపై సమగ్ర దృష్టికోణం

హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మూసీ నది ప్రక్షాళన, హైదరాబాద్ నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై సమగ్ర ప్రణాళికను వివరించారు.

మూసా–ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన స్థలంలో బాపూ ఘాట్ నిర్మించామని, నదీ పరివాహక ప్రాంతాల్లోనే మానవ నాగరికత వికసించిందని సీఎం తెలిపారు. కాకతీయుల కాలం నుంచి నిజాం నవాబుల వరకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర ఉందన్నారు.

1908లో హైదరాబాద్ నగరాన్ని భారీ వరద ముంచెత్తిన అనంతరం వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం ప్రభుత్వం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని, అవే నేటికీ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు. ధనవంతుల ఫామ్‌హౌజుల డ్రైనేజీ ఈ జలాశయాల్లోకి చేరకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని, విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

లండన్ థేమ్స్ నది, న్యూయార్క్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలను సందర్శించి ప్రపంచ నగరాల అభివృద్ధి విధానాలను అధ్యయనం చేశామని, ప్రపంచస్థాయి నగరాలన్నీ తమ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయని తెలిపారు. గుజరాత్‌లో సబర్మతి నది ప్రక్షాళనలో 60 వేల కుటుంబాలను తరలించారని, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్‌ఫ్రంట్ నిర్మించారని గుర్తుచేశారు. వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసినా తాము వ్యతిరేకించలేదని, తప్పుపట్టలేదని చెప్పారు.

మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని, పరిశ్రమల వ్యర్థాలు, జంతు కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంత మహిళలు గర్భం దాల్చలేని పరిస్థితి ఉందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు.

ప్రపంచ నగరాల అభివృద్ధిని చూసిన తరువాత మూసీలో నిరంతరం శుద్ధమైన నీరు ప్రవహించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించామని చెప్పారు. కన్సల్టెన్సీలను నియమించి మూసీ ప్రక్షాళనకు సమగ్ర ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.

బాపూ ఘాట్ వద్ద రెండు నదులు కలిసే చోట వీ ఆకారంలో (V షేప్) గాంధీ సరోవర్ అభివృద్ధి జరుగుతోందని, గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మొత్తం 20 టీఎంసీల్లో 15 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతర శుద్ధ జల ప్రవాహానికి వినియోగించనున్నట్లు తెలిపారు.

మూడు నదుల సంగమంగా బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయనున్నామని, మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఏడీబీ బ్యాంకు రూ.4,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని, గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందన్నారు.

గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. ఓల్డ్ సిటీని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, అదే అసలైన నగరమని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు.

తనపై కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్న విమర్శలు చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ కూడా ఒక పరిశ్రమేనని వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని గుర్తు చేశారు. రోజురోజుకూ పట్టణీకరణ పెరుగుతోందని, రాబోయే 20 ఏళ్లలో అది 75 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు.

మూసీ కాలుష్యానికి మించిన ప్రమాదం కొందరి కడుపులో ఉన్న విషమేనని వ్యాఖ్యానిస్తూ, తాను వివరాలు చెబుతుంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిజాలు ప్రజలకు తెలియకూడదన్న ఉద్దేశంతో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారని తెలిపారు.

మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలకు మెరుగైన వసతులు కల్పించాలంటే విపక్షం అడ్డుపడుతోందని విమర్శించారు. మంచిరేవుల దగ్గర మూసీ పరివాహకంలో ఉన్న ప్రాచీన శివాలయాన్ని అభివృద్ధి చేస్తామని, అలాగే గురుద్వారా, మసీదు, చర్చి నిర్మించి మత సామరస్యాన్ని చాటుతామని ప్రకటించారు.

డీపీఆర్ సిద్ధమైన తరువాత అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని, గాంధీ సరోవర్ నిర్మాణానికి డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా అంగీకరించారని వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం సూచిస్తూ, తమ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పాలని కోరారు. పేదలకు మంచి ఇళ్లు కట్టించి మెరుగైన వసతులు కల్పిద్దామని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

డీపీఆర్ సిద్ధమైన తరువాత అన్ని ఎమ్మెల్యేలకూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సూచనలు తీసుకుంటామని తెలిపారు. చివరగా, “కొంతమంది తమ కడుపులో ఉన్న విషాన్ని తగ్గించుకుంటే మంచిది” అంటూ విమర్శకులకు ఘాటైన సందేశం ఇచ్చారు.

Share this post

One thought on “మూసీ ప్రక్షాళనపై సమగ్ర ప్రణాళిక-సీఎం రేవంత్ రెడ్డి

  1. What’s Taking place i’m new to this, I stumbled upon this I have discovered It absolutely helpful and it has helped me out loads. I’m hoping to give a contribution & aid other users like its helped me. Great job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన