హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోనవకుండా గందరగోళానికి గురి కాకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని, అవసరమైనంత సరఫరా అందుబాటులో ఉందని తెలిపారు.
శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందన్న ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతోందని మంత్రి తెలిపారు. తప్పుడు ప్రచారం వల్లే ప్రజల్లో భయాందోళనలు ఏర్పడి సాధారణంగా కంటే ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రోజువారీగా సుమారు 72 శాతం బుకింగ్స్ నమోదవుతున్నాయని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 810 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కోటి 29 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండగా, రోజుకు సుమారు 2.5 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా గ్యాస్ కొరత నమోదుకాలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి సరఫరా పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు సూచించారు.
గ్యాస్ సరఫరాలో గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా మళ్లించడం లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటికే అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై 288 కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవద్దని ప్రజలకు సూచిస్తూ, పట్టణాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేయాలని వినియోగదారులను కోరారు.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఎలాంటి కొరత లేదని, ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.


Im no longer positive where you’re getting your info, however great topic. I needs to spend some time finding out more or working out more. Thank you for fantastic info I was in search of this info for my mission.