మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు


ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం
ములుగు జిల్లా


గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన – కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క

ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ (Maori Tribes) ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన “హాకా” నృత్యాన్ని వారు ప్రదర్శించారు.
హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.

తెలంగాణ–న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్‌, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు.

అనంతరం మావోరి తెగ ప్రతినిధులను గద్దల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు.

సమ్మక్క–సారలమ్మ వన దేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన