చరిత్రలో ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ జాతర- మంత్రి పొంగులేటి

ఎస్.ఎస్.తాడ్వాయి మండలం, ములుగు జిల్లా

గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు శాశ్వత చిరునామగా మేడారం
చరిత్రలో ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు ప్రభుత్వం సంకల్పం

— రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఆదివాసీ బీజాల సుందర శిల్పాలతో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు శాశ్వత చిరునామగా నిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మేడారం జాతరను నిర్వహించేందుకు సంకల్పించిందని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మహబూబాబాద్ ఎస్పీ శబరిష్, భూపాలపల్లి ఎస్పీ శిరీషెట్టి సంకీర్త్, ఐటిడిఏ పీవో చిత్ర మిశ్రా తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.లతో కలిసి ఆలయ ప్రాంగణ ల్యాండ్‌స్కేపింగ్ పనులు, ప్రధాన ఆర్చి నిర్మాణం, హరిత హోటల్ జంక్షన్ సుందరీకరణ, రహదారి నిర్మాణాలు, జంపన్నవాగు స్నానఘట్టాలు, లెవెలింగ్ పనులు, నీటి నిల్వ కోసం చేపడుతున్న ఆనకట్టల నిర్మాణాలను పరిశీలించారు.

జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బాంబూ చికెన్ క్యాంటీన్‌ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి మేడారంలోని హరిత హోటల్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, గుత్తేదారులతో జాతర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాకారం పీటీ బీమ్స్ అమరిక, గద్దెల రాతి స్తంభాలపై బ్రాకెట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, ఆలయ ప్రాంగణం, జాతర సివిల్ వర్క్స్, క్యూ లైన్ షెడ్ల నిర్మాణాన్ని జనవరి 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన రహదారుల ఇరువైపులా సైడ్ బర్ములు ఏర్పాటు చేయాలని, పబ్లిక్ స్థలాల్లో అనధికారిక దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర పరిసర ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య లేకుండా బోర్‌వెల్లు, చేతి పంపులు ఏర్పాటు చేయాలని, సంక్రాంతి ముందు నుంచి జనవరి 31 వరకు మేడారం ప్రాంతం విద్యుత్ కాంతులతో వెలుగొందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పారిశుధ్య పనుల కోసం జోన్లు, సెక్టార్ల వారీగా సిబ్బందిని నియమించాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మంత్రులు శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలోనే గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఆరాధించే, కోట్లాదిమంది గిరిజనేతరులకు కూడా ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని తెలిపారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేస్తున్నామని, ఈ నెల 20వ తేదీలోగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి వచ్చి రాత్రి బస చేసి, తెల్లవారుజామున పునరుద్ధరణ పనుల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సంవత్సరం జాతరకు తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కోట్లాదిమంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతర నిర్వహణలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మంత్రి సీతక్క ఇక్కడే ఉండి పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారని, తక్కువ సమయంలోనే రాతితో 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టామని అన్నారు.

ఆలయ పునరుద్ధరణకు సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌లు హెలిప్యాడ్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్టులు, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు