బి.సి రిజర్వేషన్ల కోసం
సంబరాలు ఆపి సమరం చేయాలి
బి.సి లు మేలుకోండి ఊరు, వాడలో నిరసనలు తెలుపండి
ఆధిపత్య కులాల వారు వేస్తున్న అడ్డుకాలును అడ్డుకోవాల్సిన అత్యవసరాన్ని గుర్తించాలి
మరో తెలంగాణ ఉద్యమం లాగ బి.సి ఉద్యమం చేయాలి
భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు జరిగిన అన్ని పోరాటాల్లో కీలకపాత్ర పోషించడమే కాకుండా ఎన్నో త్యాగాలు చేసిన బి.సి సమాజం నేడు బి.సి సమాజ ఉనికి కోసం, ఆత్మగౌరవం, అధికారం కోసం, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కోసం సమరం చేయాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది.
ఎవరో రిజర్వేషన్లు ఇస్తారని ఎదురుచూస్తే ఎండమావే మిగులుతుంది. దశాబ్దాల తరబడి బిసీలను మభ్యపెడుతూ వారి వోట్లతో అధికారంలోకి వచ్చిన నాయకుల మాయమాటల మైకంలో పడిపోయి ఇదిగోరిజర్వేషన్లు అదిగో రిజర్వేషన్లు అంటే చంకలు ఎగిరేసి సంబరపడి పోతున్నాం. ఇక ఇవన్ని ఆపివేసి రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు సాధించేందుకు పాలకులమెడలు వంచాలి. బిసి రిజర్వేషన్ల కోసం ఎవరిని భిక్ష కోసం అడుక్కోవాల్సిన అవసరంలేదు. జనాభాలో యాభై శాతానికి మిన్నగా ఉన్న వెనుకబడిన తరగుతుల వారికి న్యాయంగా దక్కాల్సిన వాటాకోసం పోరాటం ఒక్కటే బి.సీల ముందు ఉన్న ఏకైన మార్గం.
కాకా కాలేల్కర్ కమీషన్ నుండి కామారెడ్డి డిక్లరేషన్ వరకు బి.సి లకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలపై, ఆధిపత్య కులాలపై పోరు చేయాల్సిన సందర్భంలో బి.సి ల నుండి ఆయా రంగాల్లో ఎదిగిన వారు ముందుకొచ్చి సమరబేరి మోగించాల్సిన అవసరముంది. రాజకీయంగా, న్యాయపరంగా బి.సి రిజర్వేషన్లకు అడ్డుకాలు వేస్తున్న ఎదిగిన ఆధిపత్య కులాల బండారం బయటపెట్టే సమరానికి సిద్ధం కావాల్సిన తరుణంలో సగబాగమైన బి.సి మహిళా సమాజం, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, ఉద్యమకారులు, సబ్బండ కులాల వారు ఐక్యమై రాజ్యాధికారానికై రణం చేయాలి. ఇంతవరకు చేసిన అనేక పోరాటాల్లో బి.సి లు కాని వారు లబ్ధి పొందారు. నూటికి నూరు శాతం బి.సి లకు మేలు చేసే యుద్ధంలో బి.సి లు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
తరతరాలుగా చాకిరి చేస్తూ సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న బి.సి సమాజం బతుకలేక బలిదానాలు చేసుకుంటున్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో బి.సి సమాజం తిరుగుబాటు చేయాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. స్వాతంత్రం వచ్చి 80 ఏండ్లు కావస్తున్న ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో చట్టసభల్లోకి ప్రవేశం లేని మెజార్టీ సమాజం ఏదైనా ఉందా అంటే అది బి.సి సమాజమే. ప్రపంచంలో ఏ దేశములోనైనా మెజార్టీ సమాజం అధికారంలో ఉంది. కానీ భారతదేశంలో మాత్రం వేల ఏండ్లుగా మెజార్టీ ఉత్పత్తి సమాజం అన్ని రకాలుగా అణచివేతకు గురవుతుంది. పూలే, పెరియార్, అంబేద్కర్ లాంటి వాళ్ల త్యాగం, కృషి వల్ల ఎస్సీ, ఎస్టీ లకు విద్యా, ఉద్యోగాలతో పాటు చట్టసభల్లో స్థానం లభించింది. 80 ఏండ్ల స్వాతంత్ర దేశంలో బి.సి లకు చట్టసభల్లోకి ప్రవేశం ఎందుకు లేదో? మెజార్టీ సమాజానికి చట్టసభల్లోకి ప్రవేశం లేకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందో? ఎప్పుడైనా బి.సి సమాజం ఆలోచించిందా? ఆలోచించలేదు కాబట్టే ఆధిపత్య వర్గాల వారు పాలించుకుంటూ పోతున్నారు. బి.సి సమాజం పని కోసం పాకులాడుతుంటే ఆధిపత్య కులాలు మాత్రం పాలన కోసం పోటీ పడుతున్నారు. కాయ కష్టంతో ఉత్పత్తి చేస్తున్న బి.సి సమాజానకి సంక్షేమ పథకాలు, ఆధిపత్య వర్గాలకు పాలన అవుతుంది. సమాజానికి అన్నం పెట్టే రైతులు అడ్డ మీది కూలీలయ్యారు. ఉన్నత చదువులు చదివిన బి.సి సమాజం దేశం విడిచి వెళ్ళడమే కాకుండా ఉద్యోగాలు రాక ఉరిబెట్టుకుంటున్నారు. విద్య, వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలై ఆగమవుతున్నారు. వీటన్నికి కారణం 80 ఏండ్లుగా బి.సి సమాజానకి చట్టసభల్లో తగినంత ప్రాతినిధ్యం లేక పోవడమే. చట్టసభల్లోకి వెళ్ళాలంటే మొదట స్థానిక సంస్థల్లోకి వెళ్ళాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం వాటా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంటే కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి ప్రభుత్వం ఎంతో విష ప్రచారం చేసి బి.సి రిజర్వేషన్లకు అడ్డుపడుతుంది. బి.సి లకు రిజర్వేషన్లు ఇస్తే అందులో నుండి ముస్లిం బి.సి లకు రిజర్వేషన్లు వెళతాయని హిందూ బి.సి లను బిజెపి దాని అనుబంధ సంఘాలు తప్పుతోవ పట్టిస్తున్నాయి. రాజ్యాంగ ప్రకారం కొన్ని ముస్లిం కులాలు బి.సి జాబితాలో ఉన్నాయి. అసలు రాష్ట్రాల వారిగా బి.సి జాబితా తయారు చేసినప్పుడు దూదేకుల, నూరుబాష, ఫకీరు తదితర కులాల వారు ఇస్లాం మతంలో లేనే లేరు. నేటికి మెజార్టీ సమాజం ముస్లిం సాంప్రదాయాలకు దూరంగానే ఉంటున్నారు. వృత్తి కులాలుగా వారిని బి.సి లుగా పరిగణించి గత 75 ఏండ్లుగా బి.సి లుగా ఉన్నవారిని మతం పేరుతో బి.సి జాబితా నుండి తీసివేయాలని హిందువులను రెచ్చగొట్టి బి.సి సమాజాన్ని విడదీస్తున్న బిజెపి కుట్రలను ప్రజలు గమనించాల్సిన అవసరముంది.
బిజెపి పార్టీ మొదటి నుండి బి.సి లకు పచ్చి వ్యతిరేకమైన పార్టీ అనే సత్యాన్ని బి.సి సమాజం తెలుసుకోవాల్సిన అవసరముంది. మండల్ కమీషన్ చేసిన 40 సిఫారసుల్లో ఒక్కటైన విద్య, ఉద్యోగాల్లీ బి.సి లకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాటి ప్రధాని వి.పి సింగ్ ప్రకటించగానే వి.పి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని జనతా ప్రభుత్వాన్ని పడగొట్టింది మొదలు నేటి వరకు బిజెపి బి.సి లకు అన్ని రకాలుగా నష్టం చేస్తూనే వుంది. భారతదేశ బి.సి ప్రజలు వారి రిజర్వేషన్ల కోసం మండల్ ఉద్యమం చేస్తుంటే బిజెపి పార్టీ దానికి వ్యతిరేకంగా కమాండల్ (రామ జన్మభూమి రథ యాత్ర) ఉద్యమం మొదలు పెట్టి హిందూ మతం, రాముడి పేరుతో అమాయక బి.సి లను బిజెపి దాని బావాజలం వైపు తిప్పుకుంది. అనాటి నుండి నేటి వరకు హిందూత్వ పేరుతో బి.సి ఓట్లు కొల్లగొడుతూ బి.సి లకు అన్ని రకాలుగా బిజెపి అన్యాయం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు బి.సి జనగణ చేయాలని, బిజెపి అధికారంలోకి వస్తె కుల జనగణన జరిపి బి.సి లకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి న్యాయం చేస్తామని ప్రకటించిన బిజెపి గద్దెనెక్కినంక తెడ్డు చూపింది. కుల జనగణన చేస్తే ప్రజల మధ్య విద్వేశాలు పెరుగుతాయని అత్యున్నత న్యాయ స్థానంలో బి.సి లకు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసింది. నరేంద్ర మోడీ బి.సి ప్రధాని అని బి.సి కార్డుతో అధికారంలోకి వచ్చిన బిజెపి బి.సి లకు అన్ని రంగాల్లో అన్యాయం చేసింది. ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి దేశంలో నిరుద్యోగులను పెంచింది. ప్రైవేటు విశ్వ విద్యాలయాలకు అవకాశమిచ్చి మౌళిక రంగాలైన విద్య, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున దోపిడీకి అవకాశమిచ్చింది. నోట్ల రద్దుతో చిన్న చితక కంపెనీలు మూతపడి మరింత నిరుద్యోగతను పెంచింది. స్వదేశీ ఉత్పత్తులు పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచుతామని అధికారంలోకి వచ్చిన బిజెపి గత పాలకులకన్నా విదేశీ సంస్థలను దించి ఆర్థిక వ్యవస్థను వేళ్ళ మీద లెక్కబెట్టే కార్పొరేట్ల పరం చేసింది. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి దేశానికి వెన్నుముక లాంటి రైతులకు తీరని నష్టం చేసింది. గత 10 ఏండ్లుగా బిజెపి చేసిన అన్ని ప్రక్రియల్లో బి.సి ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. రాత్రికి రాత్రే ఇ.డబ్ల్యు.ఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) రిజర్వేషన్లు తీసుకొచ్చి మూడు శాతం పేదలు లేని ఆధిపత్య కులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి బిజెపి బి.సి లకు తీరని అన్యాయం చేసింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బి.సి మహిళా రాజకీయ శక్తిని నిర్వీర్యం చేసింది. బి.సి సమాజం బిజెపిని నిలదీయాల్సిన సందర్బంలో బిజెపి కుట్రలను ప్రజలకు చెప్పడంలో ఉద్యమకారులు మరింత కృషి చేయాల్సిన అవసరమంది.
కాకా కలేల్కర్ నుండి కామారెడ్డి వరకు
రాజ్యాంగ రచన సమయంలో బి.సి లకు రాజ్యాంగపరమైన హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. బి.సి ల హక్కులను పొందుపరచడం కోసం కొంతవరకు అంబేద్కర్ ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు తగినంత మద్దతు దొరకలేదు. అయినప్పటికీ ఆర్టికల్ 340 ని పొందుపరిచి బి.సి ల కోసం రాజ్యాంగబద్ధ కమీషన్లు వేసుకొని అభివృద్ధి చేసుకోవచ్చని అవకాశం కల్పించారు. ఆర్టికల్ 340 ప్రకారం బి.సి ల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 లో కాకా కలేల్కర్ కమీషన్ వేశారు. 1955 లో నివేదిక సమర్పించినా, అభివృద్ధి సూచనలు చేసినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కమీషన్ అమలును బుట్ట దాఖలు చేసింది. కాకా కలేల్కర్ కమీషన్ అమలు కోసం దేశంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆర్ ఎల్ చందపురి, కర్పూరి ఠాకూర్, బి.పి. మండల్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ లాంటి నాయకులు పెద్ద ఎత్తున పోరాడిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బి.సి ల సమస్య, కాకా కలేల్కర్ కమీషన్ అమలు జనతా పార్టీ ప్రధాన ఎజెండాగా మారింది. బి.సి లు పెద్ద ఎత్తున జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించి కేంద్రంలో అధికారం కట్టబెట్టారు. బి.సి ల హక్కులు, అభివృద్ధి, అధికారం కోసం జరిగే పోరాటాలు 1953 నుండే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కాకా కలేల్కర్ కమీషన్ అమలు చేయడానికి బదులు బి.పి మండల్ నేతృత్వంలో కొత్త కమీషన్ వేశారు. 1980 లో మండల్ నివేదిక సమర్పించే సమయానికి జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో కోల్పోయింది. దాంతో బి.సి ల సమస్య మొదటికి వచ్చింది. మండల్ కమీషన్ సిఫార్సుల అమలు కోసం లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, కర్పూరి ఠాకూర్, శరద్ యాదవ్, కాన్షీరామ్ లాంటి నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో 1989 లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రధాని వి.పి సింగ్ మండల్ కమీషన్ సిఫార్సులలో ఒకటైన విద్య, ఉద్యోగాల్లో బి.సి రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించగానే బి.సి లకు వ్యతిరేకంగా దేశంలోని ఆధిపత్య కులాలు పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలు పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు బి.సి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. కోర్టుల్లో కేసులు వేశారు. మూడు సంవత్చరాలు కేసు విచారణ అనంతరం బి.సి లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాక సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని కూడా ఆనాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలంటే సమగ్ర కుల జనగణన జరిపి బి.సి ప్రజల జీవన స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని కూడా కోర్టు సూచించింది. 1993 కోర్టు తీర్పు ప్రకారమైనా, 1955, 1980 లో ఇచ్చిన బి.సి కమీషన్ సిఫార్సుల్లో కూడా దేశ వ్యాప్తంగా కుల జనగణ చేపట్టాలని సూచించింది. ఎన్ని సిఫార్సులు చేసిన ఎంతమంది మహా నాయకులు డిమాండ్ చేసిన దేశంలో ఇంతవరకు కుల జనగణ చేపట్టలేదంటే దేశాన్ని పాలించిన పార్టీలన్ని బి.సి ల పట్ల ఒకే ఆలోచనలో ఉన్నాయని అర్థమవుతుంది. ఘనమైన చరిత్ర కలిగిన బి.సి ఉద్యమంతో పాటు ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ వల్ల బి.సి సాంప్రదాయ వృత్తులు ధ్వంసమై దేశంలో బి.సి ల సమస్య ఆరని మంట లాగా తయారైంది. దేశంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉండి గత 10 ఏండ్లుగా ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ బి.సి ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని సామాజికన్యాయం, కుల జనగణ ప్రధాన ఎజెండాగా తీసుకొని 2024 ఎన్నికల్లో పోటీ చేసింది. కేంద్రంలో అధికారంలోకి రాకున్నా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సామాజికన్యాయ ఎజెండాలో బాగంగా కామారెడ్డి సభలో బి.సి డిక్లరేషన్ చేశారు. కాకా కలేల్కర్, మండల్ కమీషన్లు సూచించిన విధంగా తెలంగాణలో బి.సి కుల జనగణన చేపడుతామని తద్వారా స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బి.సి సమగ్రాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని, కుదేలైన వృత్తి కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించి కుల వృత్తులను అభివృద్ధి చేస్తామనే తదితర అంశాలను పొందుపరిచి బి.సి ఓట్లను ఆకర్షించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల జనగణ, కామారెడ్డి డిక్లరేషన్ లోని మిగతా అంశాల అమలుకు తాత్సార్యం చేసింది. బి.సి ఉద్యమకారుల నుండి వచ్చిన నిరసనలతో కుల జనగణనకు శ్రీకారం చుట్టింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇంద్రాసహాని కేసులో సూచించిన విధంగా డెడికేటెడ్ కమిటీని నియమించి కుల జనగణన జరిపి స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ కోసం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు పంపితే ఎలాంటి సమాధానం లేకుండా అక్కడ పెండింగ్ లో పెట్టారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బి.సి లకు రిజర్వేషన్లు కల్పిస్తామని కార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కోసం ఆధిపత్య కులాల వారు హై కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆనాడు దేశంలో మండల్ కమీషన్ అమలుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసిన ఆధిపత్య కులాల వారే నేడు తెలంగాణలో బి.సి ల లబ్ధి చేసే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేశారు.
సకల సామాజిక రంగాల్లో బి.సి ల వాటా కోసం మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ వరకు ఎందరో త్యాగపూరిత పోరాటాలు చేశారు. ఆ త్యాగధనుల పోరాటాల కొనసాగింపుతో లభించిన రిజర్వేషన్లను అడ్డుకోవడానికి బిజెపి ప్రభుత్వం కూడా కుట్రలు చేస్తుంది. అంబానీ, అదానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్లకు మేలు చేసే క్రమంలో దేశ ప్రజలను మొత్తం నాశనం చేస్తున్న బిజెపి కుట్రలను బి.సి ప్రజలు క్షుణ్నంగా అర్ధం చేసుకోకుండా మత మౌఢ్యంలో గుడ్డిగా బిజెపి తప్పుడు ప్రచారాలను నమ్మితే బి.సి లు మరింత నాశనమయ్యే ప్రమాదముంది. పల్లె నుండి పార్లమెంటు వరకు అన్ని స్థాయిల్లో వందల ఏండ్లుగా అధికారాన్ని అనుభవించిన ఆధిపత్య కులాల వారు నేడు బి.సి రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు. ఆధిపత్య కులాల కుట్రలను, బిజెపి కుట్రలను బి.సి సమాజం అర్ధం చేసుకొని పోరాటం చేయాలి. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఏకం కావాలి. బి.సి న్యాయవాదులు కోర్టుల్లో పోరాటం చేయాలి. ఉద్యమకారులు వీధుల్లో ప్రజలను కదిలించాలి. ప్రజలతో కలిసి ముందుకు రాని బి.సి రాజకీయ నాయకులను నిలదీయాలి. ఫీజులు కట్టలేక విద్యార్థులు, ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులు, చేసిన అప్పులు తీరక తల్లితండ్రులు చనిపోతుంటే, రాష్ట్రములో రోజుకొక ఇంట్లో పీనుగలు ఎలుతుంటే బి.సి సమాజం చోద్యం చూస్తూ కూర్చుంటే భవిషత్ అగమ్యగోచరం అవుతుంది. వివిధ సందర్భాల్లో నేరాలకు పాల్పడిన వారిని ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేయాలని వీధుల్లోకి వచ్చి నినదించే బి.సి ప్రజలు బి.సి ల చావులకు కారణమవుతున్న వారికి వ్యతిరేకంగా, బి.సి లను రక్షించే రాజకీయ అధికారానికి అడ్డు పడే వ్యవస్థకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాల్సిన అవసరాన్ని గుర్తించి ముందుకు రావాల్సిన అత్యవసరముంది. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. పండుగ సంబరాల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం. బి.సి సమాజం ఇకనైనా జ్ఞానోదయమై సంబురాలు ఆపి సమరం చేస్తేనే భవిషత్ తరాల మనుగడ సాధ్యమవుద్ధి.
… సాయిని నరేందర్

న్యాయవాది
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
9701916091