ఆయుధాలతో లొంగి పోయిన మావోయిస్టులు

మావోయిస్టు ఉద్యమానికి చరిత్రాత్మక ఎదురుదెబ్బ: పీఎల్‌జీఏ యుద్దానికి ముగింపు, 20 మంది లొంగుబాటు
తెలంగాణలో సీపీఐ (మావోయిస్టు) సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్ కమాండర్ బడ్సే సుక్కా @ దేవా సహా మొత్తం 20 మంది అండర్‌గ్రౌండ్ మావోయిస్టు నేతలు, కార్యకర్తలు 2026 జనవరి 3న తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
వీరితో పాటు 48 తుపాకులు, 2,206 రౌండ్ల అమ్యూనిషన్, రూ.20.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బడ్సే సుక్కా @ దేవా లొంగుబాటుతో పీఎల్‌జీఏ ఆఖరి బలమైన నిర్మాణం పూర్తిగా కూలిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన సీపీఐ (మావోయిస్టు)లో రెండో స్థాయి కీలక ఆదివాసీ నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి.
మడవి హిడ్ మా కు సన్నిహితుడైన దేవా, 2003లో మావోయిస్టు ఉద్యమంలో చేరి సైనిక వ్యూహాలు, పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాల సమీకరణలో నైపుణ్యం సంపాదించాడు.
హిడుమా పదోన్నతితో పీఎల్‌జీఏ నుంచి వెళ్లిన తర్వాత, 2023 నవంబరులో దేవాను బెటాలియన్ కమాండర్‌గా నియమించారు. జీరాం ఘాటి దాడి సహా పలు దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఆయనపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలు మరియు ఎన్ఐఏ కలిపి రూ.75 లక్షల రివార్డు ప్రకటించాయి.
అదే రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన కీలక నేత కంకనాల రాజీ రెడ్డి @ వెంకటేష్ (ఎస్‌సీఎం) కూడా లొంగిపోయారు. ఆయన 1997లో మావోయిస్టు ఉద్యమంలో చేరి, 2019లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో కీలక బాధ్యతలు నిర్వహించిన రాజీ రెడ్డి, కర్రెగుట్టలు ప్రాంతంలో గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు.
ఆయన లొంగుబాటుతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఒకరిని మినహాయించి మిగతా కీలక నేతలంతా ఉద్యమం నుంచి బయటకు వచ్చినట్లే నని డీజీపీ తెలిపారు.
లొంగిపోయిన 20 మందిలో పీఎల్‌జీఏ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, దక్షిణ ఉప జోనల్ బ్యూరో, దక్షిణ–పడమర బస్తర్ డివిజన్లకు చెందిన కమాండర్లు, సభ్యులు ఉన్నారు. వీరి వద్ద నుంచి రెండు ఎల్‌ఎమ్‌జీలు, ఎనిమిది ఏకే–47 రైఫిళ్లు, పది ఇన్సాస్ రైఫిళ్లు, ఎనిమిది ఎస్‌ఎల్‌ఆర్‌లు, అమెరికా తయారీ కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ తయారీ టేవర్ రైఫిల్, బీజీఎల్‌లు, గ్రెనేడ్లు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 అక్టోబర్ 21న చేసిన పిలుపుకు స్పందనగా ఈ లొంగుబాట్లు జరిగాయని DGP తెలిపారు. హింసను వీడి ప్రధాన ప్రవాహంలోకి రావాలని, కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడపాలని సీఎం చేసిన విజ్ఞప్తి ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
భద్రతా బలగాల ఒత్తిడి, లాజిస్టిక్ నెట్‌వర్క్ బలహీనత, అంతర్గత విభేదాలు, సిద్ధాంతపరమైన నిరాశ, కఠిన జీవన పరిస్థితులు లొంగుబాటుకు కారణాలని లొంగిపోయిన వారు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు.
లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం ఆర్థిక సహాయం అందించనున్నారు. హోదా ఆధారంగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఆయుధాల లొంగుబాటుకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం అదనపు ప్రోత్సాహకాలు కలిపి మొత్తం రూ.1.81 కోట్లకు పైగా చెల్లించనున్నారు.
తక్షణ సహాయంగా ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందజేశారు.

డీజీపీ తెలంగాణ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసు బలగాల సమన్వయాన్ని ప్రశంసించారు. ఈ లొంగుబాట్లతో మావోయిస్టుల కార్యకలాప సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని, తెలంగాణలో శాంతి, అభివృద్ధి దిశగా ఇది కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మిగిలిన అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు కూడా ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాస పథకాలను వినియోగించుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు