రాష్ట్ర బంద్ ర్యాలీలో పాల్గొన్న వరంగల్ న్యాయవాదులు

బి.సి రిజర్వేషన్ల సాధనలో న్యాయవాదులు ముందుండాలి

రాష్ట్ర బంద్ ర్యాలీలో పాల్గొన్న వరంగల్ న్యాయవాదులు

తరతరాలుగా చాకిరి చేస్తున్న బి.సి కులాలకు న్యాయంగా దక్కాల్సిన వాటా సాధన పోరాటంలో న్యాయవాదులు ముందుండాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసిన న్యాయవాదులు బి.సి రిజర్వేషన్ల సాధనలో కూడా ముందుండాలని వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్, పులి సత్యనారాయణలు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం శనివారం నిర్వహించిన బంద్ సందర్భంగా వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించి వారు మాట్లాడిన అనంతరం మేమెంత మందిమో మా వాటా కావాలని, రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటు లో బిల్లు పెట్టాలని నినాదాలు చేస్తూ అంబేద్కర్ సెంటర్ నుండి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. బి.సి రిజర్వేషన్ల సాధనకు పార్లమెంటు, అసెంబ్లీ, రాజ్ భవన్, రాష్ట్రపతి భవన్ లను ముట్టడిస్తామని, ఆ భవనాల్లో తిష్ట వేసిన ఆధిపత్య కులాల వారిని కదిలించనంత కాలం బి.సి హక్కులను సాధించలేమని, ఆ దిశగా బి.సి ఉద్యమ నాయకత్వం ముందుకు సాగాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 ఏండ్లు కావస్తున్నపటికీ ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ సమాజమైన బి.సి లకు పాలనలో వాటా లేకపోవడం దుర్మార్గమని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బి.సి వాటా కోసం గత 70 ఏండ్లుగా బి.సి నాయకులు, బి.సి సమాజం పోరాటం చేస్తున్నా ఆధిపత్య వర్గాల పార్టీలకు చలనం లేదని అన్నారు. కాకా కలేల్కర్ కమీషన్ మొదలుకొని కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం దేశ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేశారని, కుల జనగణన చేయాలని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో వాటా కోసం నిరహార దీక్షలు, పాదయాత్రలు చేసిన ఆధిపత్య పాలకుల్లో చలనం లేదని విమర్శించారు. 

 మండల్ కమీషన్ అమలుకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసిన ఆధిపత్య వర్గాల వారు తెలంగాణ రాష్ట్రం బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా కూడా కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆధిపత్య వర్గాల వారికి మేలు చేసే ఇ డబ్ల్యు ఎస్ లాంటి చట్టాలను రాత్రికి రాత్రే తీసుకొచ్చే ఆధిపత్య పాలకవర్గాలు బి.సి రిజర్వేషన్ల కోసం మాత్రం చట్టం చేయడం లేదని, బి.సి ల ఓట్లతో గద్దెనెక్కుతున్న పాలకులు బి.సి లకు వాటా ఇవ్వడానికి మాత్రం అడ్డుకాలు వేస్తున్నారని అన్నారు. చట్టంలో సవరణలు చేయడం ద్వారనే తమిళనాడు తో సహా పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచారని పార్లమెంటులో చట్టం చేయకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి న్యాయపరమైన అడ్డంకులు వస్తున్నాయని అన్నారు.  రాష్ట్రంలోని సబ్బండ వర్గాలతో పాటు అఖిల పక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా మాత్రమే బి.సి లకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అన్నారు. బి.సి రిజర్వేషన్ల సాధనకు ఉద్యమకారులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, న్యాయవాదులు, దాక్టర్లు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, పార్టీలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు చేస్తే స్థానిక సంస్థలతో పాటు చట్ట సభల్లో వాటా సాధించగలమని అన్నారు. ఆనాడు మండల్ కమీషన్ అమలుకు మద్దతుగా నిరాహార దీక్ష చేసిన మాన్యశ్రీ కాన్షిరామ్ లాగా నేటి బి.సి రిజర్వేషన్లకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిల్ల రాజేంద్రప్రసాద్, తీగల జీవన్ గౌడ్, ఆనంద్ మోహన్, గునిగంటి శ్రీనివాస్, మైదం జయపాల్, చింత సాంబశివరావు, ఇజ్జగిరి సురేష్, కూనూరు రంజిత్ గౌడ్, గుడిమల్ల రవికుమార్, గంధం శివ, వేణుగోపాల్, లడే రమేష్, నల్ల పరమాత్మ, జగన్ మోహన్ రెడ్డి, జి విద్యాసాగర్ రెడ్డి, రామగొని నర్సింగరావు, వసంత్, యాక స్వామి, డి.సునీల్, చింత నిఖిల్, రామనాథం, మర్రి రాజు, రాచకొండ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బి.సి ఇంటలెక్టువల్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కూరపాటి రమేష్, వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ కొంగ వీరాస్వామి, కుడా మాజీ చైర్మన్ సంఘం శెట్టి సుందర్ రాజ్ యాదవ్, డాక్టర్ లక్ష్మిప్రసాద్, వివిధ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, శ్రీధర్ రాజు, పెరమాండ్ల వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు చుక్కయ్య, డాక్టర్ విజయలక్ష్మి, సుశీల తదితరులు ధర్నా వద్దకు వచ్చి సంఘీభావం తెలిపి బి.సి ల ఐక్య ఉద్యమాలు వర్ధిల్లాలని, పార్లమెంటులో బి.సి రిజర్వేషన్ల బిల్లును పెట్టాలని నినాదాలు చేసారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో