వరంగల్, ఆగస్టు 5: కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్)లో లిటరరీ అండ్ ఎక్స్ట్రామ్యూరల్ క్లబ్, స్వామి వివేకానంద జయంతి వేడుకల (SVBC) క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) పీపుల్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థుల్లో ఖాదీ, గ్రామీణ పారిశ్రామిక రంగం, గాంధేయ భావజాలం, స్వయం ఉపాధి, గ్రామీణ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన 155 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సురభి వాణీదేవి వావిలాల ఖాదీ గ్రామోద్యోగ మిషన్ ప్రాధాన్యాన్ని వివరించారు.
అతిథిగా హాజరైన కేవీఐసీ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ లంక మనోజ్ ప్రతి విద్యార్థి వారానికి కనీసం ఒకరోజు ఖాదీ వస్త్రాలు ధరించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమల ద్వారా లభించే ఉపాధి అవకాశాలతో పాటు కుమ్మరి వృత్తి, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు, ఫుడ్వేర్, తేనె ఉత్పత్తి, చింతపండు ప్రాసెసింగ్, పసుపు పొడి తయారీ, ఖనిజ ఆధారిత పరిశ్రమల గురించి వివరించారు.
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సెమీకండక్టర్ విధానానికి అనుగుణంగా ఈసీవీ–వీఎల్ఎస్ఐ (డిజైన్ అండ్ టెక్నాలజీ) బీటెక్ కోర్సును ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులకు స్టార్టప్, వ్యవస్థాపక నైపుణ్యాలపై కూడా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
కిట్స్ వైస్ ప్రెసిడెంట్, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ కార్యదర్శి వొడితల కిషన్ రావు అధ్యక్షత వహించారు. సాఫ్ట్వేర్ రంగంతో పాటు సంప్రదాయ పరిశ్రమల్లోనూ అవకాశాలను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎంఎస్ఎంఈ ఎస్ఎఫ్యూఆర్టీఐ (SFURTI) పథకం కింద ఖాదీ ప్రాజెక్టులకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు.
కార్యక్రమంలో ఎన్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రమేష్, కేవీఐసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్. లతాదేవి, కిట్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థి నిర్వాహకులు, వివిధ విభాగాధిపతులు మరియు సుమారు 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కిట్స్ వరంగల్లో కేవీఐసీ పీపుల్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్

