
KITS వరంగల్‌లో ప్రేరణాత్మక ఇంటరాక్టివ్ సెషన్లు
వరంగల్, ఆగస్టు 9, 2025:
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్)లో “కెరీర్ ప్లానింగ్, పాజిటివ్ ఆట్టిట్యూడ్ డెవలప్‌మెంట్” మరియు “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” పేరుతో రెండు ఇంటరాక్టివ్ సెషన్లు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించారు. ఆగస్టు 7 నుంచి 14 వరకు జరిగే ఏఐసీటీఈ ఆదేశించిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ (SIP) లో భాగంగా ఈ కార్యక్రమం క్యాంపస్‌లోని ఆడిటోరియం, సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్, న్యూ సెమినార్ హాల్, మెకానికల్, సివిల్ సెమినార్ హాల్స్ లో జరిగాయి.
ప్రఖ్యాత సైకాలజిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు గ్రహీత డాక్టర్ బారుపాటి గోపీ ప్రధాన వక్తగా పాల్గొని విద్యార్థులకు విలువలు, పాజిటివ్ ఆలోచన, దృష్టి, అనువర్తన శక్తి, ఒత్తిడి నియంత్రణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, వ్యక్తిగత నైపుణ్యాలు, విభిన్నతను అంగీకరించడం వంటి అంశాలపై చక్కని మార్గదర్శనం ఇచ్చారు. “భయం అనేది మనకు అతి పెద్ద శత్రువు. విమర్శలు సహజం, కానీ జీవితం ఎంతో అందమైనది. ప్రతి రోజును ఉత్తమ దినంగా మార్చుకోవచ్చు. భయాన్ని వదిలి, వాస్తవాన్ని స్వీకరించి, ఆధునిక సాంకేతికతను అలవాటు చేసుకుంటే భవిష్యత్తు మరింత వెలుగొందుతుంది” అని ఆయన అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొ. కె. అశోకరెడ్డి మాట్లాడుతూ, జీవితం ఒక సవాలు, దాన్ని స్వీకరించాలి. ఇది ఒక ఆట, గెలవడానికి, పరిశ్రమ అవసరాలకు తగ్గ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేయాలి అని సూచించారు. ఆధునిక సాంకేతిక ధోరణులను అలవాటు చేసుకొని, సృజనాత్మక ఆలోచనలతో 21వ శతాబ్ద పరిశ్రమలకు తగిన ఇంజనీర్లుగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అన్ని విభాగాధిపతులు, డీన్లు, ఫ్యాకల్టీ సభ్యులు — ప్రొ. కె. వేణుమాధవ్ (డీన్ అకాడెమిక్ అఫైర్స్), ప్రొ. కె. శ్రీధర్, ప్రొ. ఎం. శ్రీలత, డా. చి. సతీష్ చందర్, డా. డి. హరికృష్ణ, డా. హెచ్. రమేష్ బాబు (ఫిజికల్ సైన్సెస్ హెచ్‌ఓడీ), డా. కె. శివశంకర్ (మ్యాథమెటిక్స్ & హ్యూమానిటీస్ హెచ్‌ఓడీ), డా. డి. ప్రభాకర చారి, డా. పి. ప్రభాకర్ రావు, డా. ఆర్. శ్రీకాంత్ పాల్గొన్నారు. సుమారు 900 మంది విద్యార్థులు మరియు సిబ్బంది హాజరయ్యారు.
కిట్స్‌లో జరుగుతున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కొత్తగా చేరిన విద్యార్థులు కళాశాల జీవితంలో సులభంగా కలిసిపోవడానికి, విద్యా నైపుణ్యాలతో పాటు వ్యక్తిత్వ వికాసం మరియు పాజిటివ్ మైండ్‌సెట్‌ను పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.