కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపిగా ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ:
ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తమిళ భాషలో ప్రమాణం చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన కమల్‌హాసన్ – “ఇది నాకు గర్వకారణం, గౌరవకారణం” అని వ్యాఖ్యానించారు.
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంఎన్‌ఎం పార్టీ ఇచ్చిన మద్దతుకు ప్రతిగా, కమల్‌హాసన్‌కు రాజ్యసభ స్థానం కల్పించేందుకు డిఎంకె నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 6న ఆయన తమిళనాడు సచివాలయంలో సీఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితర నేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఇప్పటివరకు రాజకీయాలలో ఉన్న కమల్‌హాసన్‌కి, ఈ ఎంపీ పదవి ద్వారా నేరుగా పార్లమెంటరీ బాధ్యతలు మొదలు కానున్నాయి. ఇది ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయి కానుంది.