ఐ ఎల్ పి ఎ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్
అణగారిన పీడిత ప్రజలు ఐక్యమై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నపుడే రాజ్యాంగం రక్షించబడుతుందని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ అన్నారు.
భారత నాస్తిక సమాజం 54వ వ్యవస్థాపక దినోత్సవం, భా.నా స వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ రెండవ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా కేంద్ర పౌర గ్రంథాలయంలో రాజ్యాంగం ప్రస్తుత పరిస్థితులు అనే అంశంపై భా.నా.స జాతీయ సమన్వయకర్త జె రవి అధ్యక్షతన ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వేల సంవత్సరాలుగా భారతదేశంలోని మెజార్టీ ప్రజలను కులం, అంటరానితనం పేరుతో అణచివేసారని, బ్రాహ్మణీయ ఆధిపత్య పాలకులు మనుధర్మ శాస్త్రం పేరుతో దేశ మూలవాసి ప్రజలను విద్యకు, ఆస్తికి, అధికారానికి దూరం చేశారని, దేశంలో సగభాగమైన మహిళలను సైతం శూద్రుల లాగానే అణచివేశారని ఆ అణిచివేత కారణమైన మనుధర్మ శాస్త్రాన్ని 1927లో తగలబెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రానంతరం సమానత్వం, సౌభ్రాత్రుత్వంతో కూడిన రాజ్యాంగాన్ని అందించారని, ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. రాజ్యాంగం మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని పెరియార్ రాజ్యాంగాన్ని తగలబెట్టారని, స్వాతంత్రం వచ్చిన సందర్భంలో కూడా వెండి సంకెళ్లు పోయి బంగారు సంఖ్యల్లో పడ్డాయని పెరియార్ అన్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం రాజ్యాంగంలో ఎన్ని హక్కులు పొందుపరిచినప్పటికీ ఆ రాజ్యాంగ అమలు దోపిడీ పాలకుల చేతిలో ఉండడం వల్ల రాజ్యాంగాన్ని వారికి అనుకూలంగా సవరణలు చేసుకుంటూ ప్రజల్ని మరింత అణిచివేస్తున్నారని, ప్రజాస్వామ్య రక్షణతోనే రాజ్యాంగ రక్షణ జరుగుతుందని ప్రజాస్వామ్య రక్షణ జరగాలంటే నైతిక విలువలు కలిగిన జయగోపాల్, పెరియార్ లాంటివాళ్ళు చట్టసభల్లోకి వెళ్లాలని మెజార్టీ ప్రజలైన ఓబీసీలు చట్టసభల బయట ఉండడం వల్ల ఎస్సీ, ఎస్టి ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో ఆధిపత్య దోపిడి కులాల పార్టీలకు బానిసలుగా బతకాల్సి వస్తుందని అన్నారు. ఇంటింటికి రాజ్యాంగ చేర్చడం ద్వారానే ప్రజల్ని చైతన్య పరచి విలువల సమాజాన్ని నిర్మితం చేయొచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ పత్రిక ఎడిటర్ వి.వి. రమణమూర్తి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. బా.నా.స వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ పెరియార్ సిద్ధాంత బాటలో జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేయడమే కాకుండా కుటుంబాన్ని మొత్తం పెరియార్ సిద్ధాంత ఉద్యమంలో భాగస్వాములను చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత మౌర్య మాట్లాడుతూ బాల్య దశ నుండే విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం అలవరచడకోసం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేసిన ఘనత జయగోపాల్ కు దక్కుతుందని అన్నారు.
సిపిఐ ఆంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపర్చినట్లుగా సమానత్వం అనేది బూటకంగా మారిందని, దేశంలో ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో జైళ్లలో పెట్టడం సర్వ సాధారణమైందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన శక్తులే నేడు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానంలో ఉండడం వల్ల వారి ఇష్టానురీతిగా చట్టాలు సవరణ చేయడమే కాకుండా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను సరళతరం చేయాల్సిన పాలకులు చట్టాలను భారత న్యాయ సన్నిహిత పేర్లతో మరింత కఠినతరం చేస్తున్నారని అన్నారు. శ్రామికుల హక్కులు కాలరాసే చట్టాలను తీసుకురావడం కూడా చేస్తున్నారని అన్నారు. జీవరాశులు నివసించే ఖనిజ సంపదలను, సహజ వనరులను ధ్వంసం చేయడం వల్లనే జంతువులు ఊళ్ళ మీద పడుతున్నాయని, ఖనిజ సంపదలు సమృద్ధిగా ఉండే ప్రాంతంలో ఉన్న మావోస్టులను అంతమొందిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛను కల్పించినప్పటికీ ఆది మాటలకే పరిమితమైందని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉండే మీడియా కూడా అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న దుస్థితిలో ప్రజాస్వామ్యముందని అన్నారు. పాలకుల దోపిడీని గుర్తించే బాటలో ప్రజలు ముందుకు సాగుతున్నారని అన్నారు. జయగోపాల్ ఆలోచనలను నేటి తరం ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళని అన్నారు.
భా.నా.స ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామమూర్తి మాట్లాడుతూ భారత నాస్తిక సమాజం అంటే మూడ నమ్మకాలపైనే పనిచేయడం కాదు. మానవ హక్కులు, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేయడమని అన్నారు. రాజ్యాంగంలో ప్రజల మేలు కోసం, దేశ రక్షణ కోసం, జీవించే హక్కు కోసం ఎన్నో ఆర్టికల్స్ పొందుపరిచారని, ఆదివాసీ ప్రాంతాలను రక్షించడంతో పాటు అడవులను రక్షించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచారని, ఎన్నో హక్కులను పొందుపరచిన రాజ్యాంగ మౌలిక సూత్రాలను పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని డిమాండ్ చేసారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేసినప్పుడే ప్రజల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సెక్యులర్ దేశమని మాట్లాడుతున్నా మత మూఢత్వాలతో పాలన కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమ్ సేన నాయకులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ సర్వ సత్తాక గణతంత్ర దేశంగా ప్రకటించుకొని, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం వ్రాసుకున్న రాజ్యాంగం అమలులో లోపాల వల్ల నష్టం జరుగుతుందని అన్నారు. సెక్యులర్ దేశమంటూనే మతోన్మాదాన్ని పెంచి ప్రజలను అల్లకల్లోలం చేస్తున్న పాలకుల కుట్రలను అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుల వ్యవస్థ, మనుధర్మం, భారత రాజ్యాంగం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన జయగోపాల్ ప్రజలను చైతన్యం చేసి పోరాటాలకు సమాయత్తం చేయడంలో జీవితాన్నే త్యాగం చేశారని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి పాలకులు ఇవిఎం ల ద్వారా దొడ్డి దారిన మూడోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల ద్వారా చట్టసభల్లోకి ప్రవేశిస్తున్న ఎస్సీ, ఎస్టీ లు నిస్సాయులుగా ఉన్నారని, ఎస్సీ లకు ప్రత్యేక నియోజకవర్గాల లేనందునే వారు బానిసలుగా కొనసాగుతున్నారని, ఎస్సీ లకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం అంబేద్కర్ కృషి చేస్తే గాంధీ అడ్డుకొని నష్టం చేశాడని అన్నారు. రాజ్యాంగం రూపంలో మనుధర్మ శాస్త్రం అమలవుతుందని అన్నారు. రాజ్యాంగ అమలు కోసం, సమానత్వం కోసం ప్రజలను సమాయత్తం చేయాలని అన్నారు. బడా వ్యాపారులు చేసిన లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసే పాలకులు చిన్న, సన్నకారు ప్రజలకిచ్చిన రుణాలను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించి, తిరుగుబాటు చేస్తున్న ప్రజలను టార్గెట్ పెట్టి చంపడం ఏ దేశంలో లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైతన్య మహిళ సంఘం నాయకురాలు డి లలిత మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకమైన భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్న బిజెపి దాని అనుబంధ విభాగాలను వ్యతిరేకించాలని అన్నారు. కుటుంబాల ఐక్యతతో భావజాల వ్యాప్తితో ముందుకు సాగాలని అన్నారు. భా.నా.స విశాఖ జిల్లా అధ్యక్షులు నూకరాజు మాట్లాడుతూ మూడనమ్మకాల వల్ల పేద ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించడంలో జయగోపాల్ కీలకపాత్ర పోషించారని, పీడిత ప్రజల విముక్తి కోసం త్యాగపూరిత ఉద్యమాలు చేసిన జయగోపాల్ స్పూర్తితో మతతత్వ రాజకీయాలను ఎదురించాలని అన్నారు. మనువాద పాలకుల కుట్రలను గమనించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి కలుగుతున్న నష్టాన్ని, ప్రజాస్వామ్యానికి కలిగిన ప్రమాదాన్ని గుర్తించాలని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగిస్తున్న పాలకులు హిందూ మతానికి ప్రమాదం కలుగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న వారు రాజ్యాంగ పరిరక్షణ కోసం, విలువల రాజకీయ స్థాపన కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖ దళిత హక్కుల సంఘం నాయకులు బి వెంకట్రావు, బా.నా.స మహిళా విభాగం నాయకురాలు జె శ్యామల, స్వప్న, లలిత, స్వర్ణ, సరళ, లక్ష్మీ, సంతోష్, బి జోగినాయుడు, బోనేల కుమారస్వామి, త్రిలోచనరావు, శ్రీనివాసరావు, న్యాయవాది అప్పారావు, డార్విన్ రాము తదితరులు పాల్గొని మాట్లాడగా బా.నా.స మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ మురళి వందన సమర్పణ చేశారు.

