Headlines

హైద‌రాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి….

  • కేంద్రీయ విద్యాల‌యాలు, న‌వోద‌య విద్యాల‌యాలు ఏర్పాటు చేయండి
  • కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

ఢిల్లీ: హైదరాబాద్‌లో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని సీఎం తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎం లు ఉన్నాయ‌ని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామ‌ని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. ఐఐఎం తరగతులు వెంట‌నే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉంద‌ని కేంద్ర మంత్రి సీఎం వెల్ల‌డించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్ప‌న‌కు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు సీఎం తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్ కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉంద‌ని, అనుకూల వాతావ‌ర‌ణం, భిన్న రంగాల ప్ర‌ముఖుల‌ను అంద‌జేసిన చ‌రిత్ర హైదరాబాద్‌కు ఉంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల అవకాశాలను మెరుగుపర్చుతుంద‌ని సీఎం అన్నారు.

తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూత‌నంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉంద‌ని సీఎం అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, కామారెడ్డి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, సూర్యాపేట‌, వికారాబాద్‌, నిర్మ‌ల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాల‌యాలు, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గద్వాల‌, మ‌హ‌బూబాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, మెద‌క్‌, ములుగు, నారాయ‌ణ‌పేట‌, పెద్ద‌ప‌ల్లి, రాజ‌న్న సిరిసిల్ల‌, వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తి, యాదాద్రి భువ‌న‌గిరి, నిర్మ‌ల్‌, ఆదిలాబాద్ జిల్లాలో జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాలు వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్‌, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు