తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం గ్రూప్- 1 ఉద్యోగాలు సాధించిన మీపైనే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికయిన అభర్థులనుద్దేశించి అన్నారు.
శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్- 1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గ్రూప్- 1 ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే బాధ్యత మీపై ఉందని, మనమంతా కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి మీ భవిష్యత్తు కోసం పరీక్ష లు నిర్వహించామన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటం జరిగాయని, తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర పౌరుషం ఉందన్నారు. పదేళ్లు పాలించిన గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందో గ్రహించాలన్నారు.