మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి
ఒకే గొడుగు కింద రెవెన్యూ–సర్వే–రిజిస్ట్రేషన్ సేవలు
వారం రోజుల్లో మరో 3 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్:
రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే–ల్యాండ్ రికార్డ్స్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే భూభారతి కొత్త పోర్టల్‌ను మార్చి నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములు సహా అన్ని రకాల భూ వివరాలు ఒకే చోట స్పష్టంగా కనిపించేలా భూభారతి పోర్టల్‌లో పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. భూ లావాదేవీల్లో అయోమయం తొలగించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు.
మంగళవారం నాడు నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా)–2026 డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాల పాలనలో రెవెన్యూ వ్యవస్థలో ఏర్పడిన లోపాల నుంచి విముక్తి కల్పించాలనే ఆశతోనే తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పలు సంస్కరణలతో గ్రామ స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అయితే ఇంకా చేయాల్సిన పనులు ఎంతో ఉన్నాయని మంత్రి అన్నారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా గత రెండేళ్లలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ రైతుల భూములకు కీలకమైన సర్వే విభాగాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని, ఇప్పటికే 3,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించామని తెలిపారు. మరో వారం రోజుల్లో అదనంగా 3,000 మంది సర్వేయర్లను తీసుకోనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను క్రమంగా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రెస్సా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి, కల్చరల్ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, టీఎన్‌జీవో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్, జగదీష్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ చంద్రకళతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


Hello! This is kind of off topic but I need some help from an established blog. Is it hard to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty fast. I’m thinking about making my own but I’m not sure where to start. Do you have any points or suggestions? With thanks