ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ ఆరోపణల దాడి కొనసాగుతోంది. సల్వాజుడుం రద్దు తీర్పు వల్లే నక్సలిజం మరో రెండు దశాబ్దాలు బతికిందని ఆయన ఆరోపించారు.
ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ — “సల్వాజుడుం అనేది మావోయిస్టుల నుండి తమను తాము రక్షించుకోవడానికి గిరిజనులు ఏర్పాటు చేసుకున్న ఉద్యమం. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో అది రద్దైంది. దాంతో నక్సలిజానికి మళ్లీ ఊపిరి లభించింది. సుప్రీంకోర్టు రికార్డులు కూడా అదే చెబుతున్నాయి’’ అన్నారు.
అలాగే భద్రతా దళాల బలహీనతకు కూడా ఆయన ఇచ్చిన తీర్పే కారణమని ఆరోపించారు. “నక్సల్స్ ధ్వంసం చేసిన పాఠశాలల్లో సీఆర్పీఎఫ్, ఇతర బలగాలు తాత్కాలికంగా ఉండేవి. కానీ ఒక్క రాత్రికే వారిని బయటకు పంపించేశారు. తర్వాత వెంటనే మావోయిస్టుల దాడుల జరిగాయి. కచ్చితంగా ఆ తీర్పు మావోయిస్టులకు రక్షణగా మారింది’’ అని అమిత్ షా అన్నారు.
ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ విషయంలో ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉండటం మైనస్ కాదని స్పష్టం చేశారు. తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవడానికే రాధాకృష్ణన్‌ని ఎంపిక చేశారనడం అసత్యమన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక అనారోగ్యమే ప్రధాన కారణమని అమిత్ షా స్పష్టం చేశారు.