- బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని వరంగల్ కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా.
- ఏఐఎల్యూ, ఐఎల్పీఏ, ఐఏఎల్, కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రతినిధుల పాల్గొనడం.
- బీసీఐ నిర్ణయాలు, చైర్మన్ వైఖరి సంస్థ విశ్వసనీయతను ప్రభావితం చేస్తున్నాయని న్యాయవాదుల ఆరోపణ.
వరంగల్:
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన న్యాయవాదులు శుక్రవారం వరంగల్ కోర్టు ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్), కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐఎల్యూ రాష్ట్ర కోశాధికారి ఎన్నంశెట్టి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ బీసీఐ చైర్మన్ చర్యలు సంస్థ విశ్వసనీయత, స్వతంత్రతపై ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. బీసీఐని అడ్వకేట్స్ యాక్ట్, 1961 ప్రకారం చట్టబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున మనన్ కుమార్ మిశ్రా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీసీఐ చైర్మన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల న్యాయవాదుల ప్రయోజనాలు, హక్కులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంబంధించిన అంశంలో చైర్మన్ వ్యవహరించిన తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు.
ఐఎల్పీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ బీసీఐ వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన న్యాయవాదులకు ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర సంస్థగా పనిచేయాలని అన్నారు. బీసీఐ చైర్మన్ రాజకీయ ప్రకటనలు, నిర్ణయాలు సంస్థపై ప్రభావం చూపుతున్నాయని వారు ఆరోపించారు.
1961 అడ్వకేట్స్ యాక్ట్ కింద ఏర్పాటైన బీసీఐ తన చట్టబద్ధమైన పరిధిలో పనిచేసి న్యాయవాదుల హక్కులు, రక్షణ కోసం కృషి చేయాలని వారు అన్నారు. మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎల్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు సారంపల్లి మధుసూదన్ రెడ్డి, ఐఎల్పీఏ రాష్ట్ర కమిటీ సభ్యులు జన్ను పద్మ, జిల్లా నాయకుడు పెండ్యాల అనిల్, హనుమకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రఘుపతి, ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీమనాథం శ్రీనివాస్, కొత్తపల్లి చిరంజీవి, చంద్రమౌళి, మేడారపు రంజిత్, పాము రమేష్, అబ్దుల్ నబి, ఆనంద్, గంజి రమేష్, గంధం శివ, పూర్ణచందర్, భవాని ప్రసాద్, ప్రభంజన్, పూసపల్లి శ్రీనివాస్, యాకస్వామి, బండి మొగిలి, ఇజ్జగిరి సురేష్, మల్లేష్, విష్ణువర్ధన్, వేముల రమేష్, బండి హరీష్, గురిమిల్ల రాజు, మర్రి రాజు, బానోత్ విజయ్, మేకల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

