. 22A సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
- 757 ఫిర్యాదులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
- 22A సమస్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18005994788 ఏర్పాటు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 22A నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేటు భూమి న్యాయబద్ధమైనదైతే ఒక్క గజానికి కూడా 22A కారణంగా ఇబ్బంది కలగనివ్వబోమని, అదే సమయంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని రెవెన్యూ మంత్రి స్పష్టం చేశారు.
సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లతో 22A అంశంపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 22A కారణంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. 22Aను కారణంగా చూపించి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం ఇకపై సహించబోమని స్పష్టం చేశారు.
22Aకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన మొత్తం 757 ఫిర్యాదులను ఈ నెలాఖరులోగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి నిషేధిత జాబితాలో ఉందనే ఒక్క కారణంతో దరఖాస్తును తిరస్కరించకుండా, ఆ భూమి ఎందుకు జాబితాలోకి వచ్చిందో, సంబంధిత రికార్డులు ఏమి చెబుతున్నాయో, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి ఏమిటో సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు తదితర రికార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్లకు పహాణి రికార్డుల యాక్సెస్ కూడా కల్పించినందున, రికార్డులను పరిశీలించి నిజమైన కేసులను వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
అవసరమైతే రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యను పెంచడంతో పాటు కార్యాలయాల పని వేళలను కూడా పెంచాలని సూచించారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని సందర్భాల్లో అందుకు గల కారణాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లయితే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని ఆదేశించారు.
గతంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన కొన్ని భూముల వివరాలు సక్రమంగా కొనసాగకపోవడంతో అవి మళ్లీ నిషేధిత జాబితాలోనే ఉన్న సందర్భాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో కొంతమంది నిజమైన భూ యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
అలాగే భూదాన్, దేవాదాయ, అటవీ భూముల పక్కన ఉన్న కొన్ని ప్రైవేటు భూములు ఒకే సర్వే నంబర్ కారణంగా నిషేధిత జాబితాలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, అలాంటి భూములను గుర్తించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
22A సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ఇద్దరు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 18005994788 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి భూములు 22A నిషేధిత జాబితాలో ఉంటే వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిశీలించి, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడం, నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేయడం అనే రెండు లక్ష్యాలతో 22A సమస్యలను పరిష్కరిస్తామని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మంత్రి హామీ ఇచ్చారు.

