దండకారాణ్యం ఖాళీ అయినట్లేనా?
మావోయిస్టు పార్టీలో భారీ పరిణామం: నలుగురు అగ్ర నాయకులు లొంగుబాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 24, 2026: నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న నలుగురు సీనియర్ నాయకులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబడి జనజీవన ప్రవాహంలోకి తిరిగి చేరారు. రాష్ట్ర డీజీపీ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది.
లొంగుబడ్డ వారిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవుజి అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా ఉన్నారు.
ఈ నలుగురు నాయకులు మావోయిస్టు పార్టీలో దశాబ్దాల పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. దేవుజి సుమారు 44 సంవత్సరాలు, మల్ల రాజిరెడ్డి 46 సంవత్సరాలు, దామోదర్ 28 సంవత్సరాలు, గంగన్న 36 సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితం గడుపుతూ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
మావోయిస్టు నిర్మాణంపై భారీ ప్రభావం
పోలిట్‌బ్యూరో సభ్యుడు దేవుజి, సెంట్రల్ కమిటీ సభ్యుడు రాజిరెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో ఉన్న అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం బలహీనపడినట్లు అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగన్న లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు పార్టీ నిర్మాణం దాదాపు నిర్వీర్యమైందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
దేవుజి – పార్టీలో కీలక వ్యూహకర్త
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవుజి, మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందారు. ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేశారు. 1982లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరిన ఆయన, తరువాత పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగి పార్టీలో కీలక నిర్ణయాల్లో పాల్గొన్నారు.
మల్ల రాజిరెడ్డి – నాలుగు దశాబ్దాల మావోయిస్టు జీవితం
పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్తులపల్లికి చెందిన మల్ల రాజిరెడ్డి, 1970లలోనే ఉద్యమంలో చేరారు. దండకారణ్యం, మహారాష్ట్ర, ఒడిశా వంటి ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు.
దామోదర్ – తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి
ములుగు జిల్లాకు చెందిన దామోదర్, 1998లో ఉద్యమంలో చేరి క్రమంగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ సైనిక వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.
గంగన్న – PLGAలో కీలక నాయకుడు
గుంటూరు జిల్లాకు చెందిన గంగన్న, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)లో ముఖ్య నాయకుడిగా పనిచేశారు. రాజకీయ విద్యా విభాగంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.
లొంగుబాటుకు కారణం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన పిలుపుతో మావోయిస్టు పార్టీలో ఉన్న నాయకులు జనజీవనంలోకి రావాలని సూచించగా, దానికి స్పందించి ఈ నలుగురు నాయకులు లొంగుబాటుకు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
చారిత్రాత్మక పరిణామంగా పోలీసుల అభిప్రాయం
ఇంతటి ఉన్నత స్థాయి నాయకులు లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలో మావోయిస్టు ప్రభావం మరింత తగ్గే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

