వినాయక చవితి వేళ లడ్డూ వేలం పాటలంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డూ. దశాబ్దాలుగా రికార్డు ధరలకు అమ్ముడవుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఖైరతాబాద్ భారీ గణనాధుడి ఆకర్షణ తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం హైదరాబాద్ లో పెద్ద క్రేజ్ క్రియేట్ చేసింది.
అయితే, ఇటీవల కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డూ వేలం పాటలు భక్తుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ సన్‌సిటీలోని రిచ్‌మండ్ విల్లాస్‌లో నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్ర సృష్టించింది. ఈసారి లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ వేలం, గత ఏడాది రికార్డును బద్దలుకొట్టింది. గతంలో ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లకు అమ్ముడవగా, ఈసారి రూ. కోటి నుంచి వేలం మొదలై చివరికి రూ.2.32 కోట్లకు చేరింది.
ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డూ వేలం, స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల వారిని కూడా ఆకర్షిస్తోంది. ఈసారి పలికిన భారీ ధర హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలం పాటలకు మరో కొత్త చరిత్రను సృష్టించింది.
వేలం పాటలో వచ్చిన వాటితో చారిటబుల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలంలో పాడిన పాటలో ఏ ఒక్కరో కాకుండా విల్లాస్‌లోనాలుగు గ్రూపులుగా విడిపోయి అందరూ కల్సి వేలంలో పాల్గొన్నారు.