టూరిస్టు జిల్లాగా పేరు గాంచిన ములుగు జిల్లా మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఇంచెర్ల గ్రామంలో ₹37 కోట్ల రూపాయల వ్యయంతో ఎకో ఎత్నిక్ విలేజ్ నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, కాంగ్రేస్ పార్టీ లీడర్ గొల్ల పల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రామప్ప ఆలయం (యునెస్కో గుర్తింపు), లక్నవరం, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర స్థలం, బోగత జలపాతం, అటవీ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు పలు పనులు చేపట్టామని చెప్పారు.
ప్రధాన ప్రాజెక్టుల వివరాలు:
• జాతీయ రహదారి సమీపంలో ఆర్టిజన్ల కోసం షాపింగ్ కాంప్లెక్స్, హ్యాపీ థియేటర్ (₹37 కోట్లు).
• రామప్పలో ఐలాండ్ పనులు (₹13 కోట్లు), లక్నవరం వద్ద కొత్త ఐలాండ్‌లు.
• మేడారం జాతర భక్తుల సౌకర్యం కోసం ₹150 కోట్లు కేటాయింపు, జంపన్న వాగుపై ₹5 కోట్లతో ప్రత్యేక పనులు.
“ములుగు జిల్లా పర్యాటక కేంద్రంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేస్తాం” అని సీతక్క హామీ ఇచ్చారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, సీతక్క కృషి వల్లే ములుగు జిల్లాకు రాష్ట్రం మాత్రమే కాకుండా కేంద్రం నుండి కూడా నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ములుగును పర్యాటక హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
1wj25l