హైడ్రా తొలి వార్షికోత్సవం
హైదరాబాద్: హైడ్రాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బతుకమ్మకుంట వద్ద జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి వనరుల పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హైడ్రాను మూసీ నదితో అనుసంధానం చేయడం దురదృష్టకరం. ఒవైసీ కళాశాలల విషయంలో మనం మొదటి నుంచి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. 2015-16లో ఆ కళాశాలలు నిర్మించబడ్డాయి. ఆ ప్రాంతానికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ 2016లోనే జారీ చేశారు” అని తెలిపారు.
సల్కం చెరువు నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు
సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని రంగనాథ్ చెప్పారు. “హైదరాబాద్ నగరంలోని 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్లు ఇంకా జారీ కాలేదు. ఇప్పటివరకు 140 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ జారీ చేశాం. మిగతా 540 చెరువులకు పదేళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చాం” అని వివరించారు.

నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అవసరమైతే అనధికారిక నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు.
ఒవైసీ కళాశాలపై తప్పుదారి పట్టించే ప్రచారం
ఒవైసీ కళాశాలల విషయంలో పదేపదే ప్రశ్నలు వస్తున్నాయని, “హైడ్రాకు ఏ వర్గం కళాశాల అయినా ఒక్కటే. వివక్ష చూపడం లేదు. పేదలపై హైడ్రా ఇబ్బంది పెడుతోందన్న ప్రచారం అసత్యం. ఆక్రమణల వెనక ఉన్న పెద్దలు తప్పించుకునేందుకు పేదలను ముందుకు తోసుతున్నారు” అని అన్నారు.
బతుకమ్మకుంట అభివృద్ధికి చర్యలు
సెప్టెంబర్‌లో బతుకమ్మ వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, అందుకు అనుగుణంగా బతుకమ్మకుంట అభివృద్ధి పనులు చేపడతామని రంగనాథ్ తెలిపారు. ప్రజలు తమ ఆస్తులను ఆక్రమణల నుండి కాపాడుకోవాలని ఆయన సూచించారు.