మేడారం (ములుగు జిల్లా), అక్టోబర్ 13:
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.251 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మరియు వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో మేడారం చేరుకున్న మంత్రిని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పి శబరిష్, ఐటీడీఏ పి.ఓ. చిత్ర మిశ్రా తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
మంత్రివర్యులు మేడారం లోని శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
తరువాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, 90 రోజులలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలు పనిచేసి నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయాలని సూచించారు. ప్రకృతి వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి పనులు జరగాలని అన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు మేడారం మహాజాతర అభివృద్ధి పర్యవేక్షణ బాధ్యతలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారని తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అమ్మవార్ల దర్శనం జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ, గతంలో జంపన్న వాగుపై వంతెనను 45 రోజుల్లో పూర్తి చేసినట్లే ఇప్పుడు కూడా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, 2026 జనవరిలో జరిగే మేడారం మహాజాతరను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నదని తెలిపారు.
గద్దెల ప్రాంగణ అభివృద్ధికి ఇప్పటికే రూ.101 కోట్లు మంజూరు చేసినట్లు, మరో రూ.71 కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు.
సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనార్థం భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున మేడారం ప్రాంతాన్ని శాశ్వత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పి శబరిష్, ఐటీడీఏ పి.ఓ. చిత్ర మిశ్రా, డి.ఎఫ్.ఓ. రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్కిటెక్చర్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
