సాంకేతిక విద్యకు చిరునామా.. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ @70

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తన స్థాపనకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్లాటినం జూబ్లీ వేడుకలను (29-3-2026) ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

సాంకేతిక విద్యలో విశిష్ట గుర్తింపు పొందిన ఈ విద్యాసంస్థ, చిన్న స్థాయిలో ప్రారంభమై నేడు మహావృక్షంగా అభివృద్ధి చెంది వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచింది.

ప్రారంభ దశలో నగరంలోని అజంజాహి మిల్లులోని ఒక షెడ్డులో కేవలం 120 మంది విద్యార్థులతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులతో తరగతులు ప్రారంభమయ్యాయి. అనంతరం వరంగల్‌లోని ఎన్‌ఐటీ (ఆర్‌ఈసీ) తరగతులు కూడా తొలినాళ్లలో ఇదే కళాశాలలో నిర్వహించబడటం విశేషం.

ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా ఎదిగి కళాశాలకు కీర్తి తీసుకువచ్చారు. బీహెచ్‌ఈఎల్, ఎచ్‌ఏఎల్, జెన్‌కో, ఎన్‌పీడీసీసీఎల్, ఎచ్‌సీఎల్, డీఆర్‌డీవో, ఇస్రో, ఐడీపీఎల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

1995 జూలై 10న 10 ఎకరాల విస్తీర్ణంలో నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన చేయబడింది. ప్రస్తుతం కళాశాలలో 1620 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 150 మంది అధ్యాపకులు మరియు సిబ్బంది సేవలందిస్తున్నారు. 1995–96లో ఈసీఈ, కంప్యూటర్ కోర్సులు ప్రారంభించబడగా, తరువాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కళాశాలకు ప్రవేశానికి అత్యధిక డిమాండ్ ఉండేది.

కళాశాల గ్రంథాలయంలో సుమారు 25 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ ప్రక్రియలు కూడా ఇక్కడే నిర్వహించబడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల ప్రకారం ఈ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించడం గర్వకారణం.

120 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ ప్రస్తుతం 1620 మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. సుమారు 20 వేల మంది విద్యార్థులు ఇక్కడి నుంచి సాంకేతిక విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.

ఈ నెల 29న కళాశాల ప్రాంగణంలో ప్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు ఇ . వి. శ్రీనివాస్‌రావు నేతృత్వంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ మహాసమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ సందర్భంగా పలువురు ప్రతిష్టాత్మక పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. దొడ్డ ఆంజనేయులు (ఐఏఎస్), సంజయ్ ములుక (ఐఎఫ్‌ఎస్), చెన్నూరి రూపేష్ (ఐపీఎస్), ప్రేమ్ సాగర్ (ఐఎఫ్ఎస్) ధరిపెల్లి రమేష్ (డిప్యుటీ డీజిఎఫ్టి), విలాయత్ అలీ (డిప్యూటీ కలెక్టర్), నాగుర్ల వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు (రాజకీయవేత్త), పింగిళి రాజన్ (డీఆర్‌డీవో శాస్త్రవేత్త), రమేష్ (ఇస్రో శాస్త్రవేత్త), రామాచంద్రమౌళి (విశ్వకవి), ఎల్లయ్య (రిటైర్డ్ ఆర్జెడీ, సాంకేతిక విద్యాశాఖ) నాగేశ్వర్ రావు (రిటైర్డ్ జాయింట్ సెక్రెటరీ, సాంకేతిక విద్యాశాఖ) తదితర అన్ని రంగాలలో అత్యున్నత స్థాయి అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు హాజరుకానున్నారు.

అధ్యక్షులు ఇ .వి. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ “ఈ కళాశాలలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి పూర్వ విద్యార్థులందరూ దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనందంగా ఉంది. కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. రూ.28 కోట్లతో నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు,” అని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ, “సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉండటం గర్వకారణం. మేధావుల నిలయంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కన్నులపండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం,” అని తెలిపారు.

ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ “ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలను చరిత్రాత్మకంగా నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆత్మీయ వాతావరణంలో సమ్మేళనం నిర్వహించడం మా లక్ష్యం. ప్రతి పూర్వ విద్యార్థి తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం,” అని అన్నారు.

-పూర్వ విద్యార్థుల సంఘం
ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం