అంచె లంచెలుగా ఎదిగిన వాడు…అందరివాడు….సుంకరి వేణుగోపాల్
నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఉద్యోగ జీవితాన్ని వెనక్కి చూసుకుంటే చాలామందికి జ్ఞాపకాలే మిగులుతాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. కానీ కొందరే వృత్తి ప్రస్థానంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి, పోరాటాలు సాగించి, సమస్యలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచినవారే చరిత్ర పుటల్లో స్థానం సంపాదిస్తారు.ఆ వర్గంలో నిలిచిన వ్యక్తి సుంకరి వేణుగోపాల్. వరంగల్ ఆర్ఈసీ లో చిన్న స్థాయి ఉద్యోగిగా ప్రారంభించి, దినసరి ఉద్యోగుల ఆశాకిరణంగా నిలిచి, క్రమంగా నాయకత్వ స్థానానికి ఎదిగారు. ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ, సహచరులు “అన్నా” అని పిలిచే వారికోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తోటి మిత్రులు చెబుతున్నారు. నిజంగా ఆయన జీవన సంగమం ఆయనను“అందరివాడు”గా నిలబెట్టింది.
విద్యా విజయాలు
సుంకరి వేణుగోపాల్ 15 సెప్టెంబర్ 1965 లో ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అబ్బాపూర్ లో జన్మించారు. ఏడవ తరగతి వరకు అదే గ్రామంలో చదివి, అనంతరం ములుగులో ఇంటర్మీడియేట్ వరకు విద్యనభ్యసించారు. తరువాత ఐటీఐ విద్యను పూర్తిచేశారు. ఆర్ఈసీ లో ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగిస్తూ, కష్టపడి వరంగల్ నైట్ పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజనీరింగ్ ను పూర్తిచేశారు. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీలో పార్ట్-టైమ్ బి.ఏ. డిగ్రీ పట్టా పొందారు.
చిరు ఉద్యోగం నుండి చెరగని ముద్ర…




ఐటీఐ పూర్తిచేసిన వెంటనే 1985లో ఆర్ఈసీ లోని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆఫీసులో వర్క్ ఇన్స్పెక్టర్ గా తాత్కాలిక నియామకం పొందారు. 1990లో సూపర్వైజర్ గా పదోన్నతి పొంది, 1996లో రెగ్యులర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. నిరంతర కృషి తో, బాధ్యతతో పనిచేసి అధికారుల ప్రశంసలు మరియు పదోన్నతులు పొందారు.
టెక్నికల్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిట్ లో ఉన్న పురాతన భవనాల మరమ్మతులు ,రోడ్లు,గార్డెన్లు , డ్రైనేజీ పనులు , ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, ఈసీఈ , అకాడమీక్, బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ వంటి అనేక భవనాల నిర్మాణాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అధికారుల మన్నలను పొందారు.
నాయకత్వ పటిమలో మేటి
సుంకరి వేణుగోపాల్ లో నాయకత్వ లక్షణాలు సహజసిద్ధంగా ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగిగా ఉన్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం కీర్తిశేషులు తోట శ్రీహరి, పంచరాతి బిక్షపతి ల నాయకత్వం లో , డైలీవేజ్ యూనియన్ జనరల్ సెక్రటరీ గా నియమితులై, ధైర్యంగా స్వరమెత్తి పోరాటాలు చేసి దేశంలోని ఇతర ఆర్ఈసీలో లేకపోయినా, మన ఆర్ఈసీలో డైలీవేజ్ ఉద్యోగులకు శాశ్వత నియామకాల సాధన జరిగింది. ఇదే స్పూర్తితో తరువాత మిగతా నిట్లలో కూడా హక్కుల సాధనకు ఆదర్శంగా నిలిచింది.
టెక్నికల్ సిబ్బందికి జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, తోటి ఉద్యోగుల మరియు నాయకుల ఆలోచనతో కలిసి టెక్నికల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ను స్థాపించి, అధ్యక్షుడు గా సుంకరి వేణు గోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల పే స్కేల్, జీతభత్యాల అసమానతలను తొలగించే క్రమంలో తోటి ఉద్యోగుల మరియు నాయకుల సహకారంతో ధర్నాలు, నిరాహార దీక్షలతో హక్కుల సాధనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, యూనియన్ నిరంతర పోరాట ఫలితంతో టెక్నికల్ ఉద్యోగులకు న్యాయమైన హక్కులు సాధించడం జరిగింది. టెక్నికల్ ఉద్యోగులకు యాజమాన్యం దృష్టిలో ప్రాధాన్యం కూడా పెరిగిందనడంలో సందేహం లేదు.
సామాజిక స్పూర్తి…
నిట్ లో పెరుగుతున్న అగ్రవర్ణాల ఆధిపత్య పోరును గ్రహించిన సుంకరి మరో అడుగు వేశాడు. వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అవమానాలు, అసమానతలు సహించలేక వారి ఉనికిని చాటడానికి ఓబీసీ అసోసియేషన్ స్థాపించి, అధ్యక్షుడిగా నియమితులైనారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అసోసియేషన్ కీలక పాత్ర వహించింది. జ్యోతిరావు పూలె దంపతుల స్ఫూర్తితో చైతన్య సదస్సులు నిర్వహిస్తూ, పదవీ విరమణ వరకు విజయవంతమైన నాయకత్వం వహించారు. అదేవిధంగా తెలంగాణ మున్నూరుకాపు జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారు. టెక్నికల్, ఓబీసీ రెండు యూనియన్ లను స్థాపించి పదవీ విరమణ వరకు బాధ్యతలు చేపట్టిన ఘనతను పొందారు. తన విరమణ సందర్భంగా కింది స్థాయి సిబ్బందికి బహుమానాలు అందించి మనసున్నవాడు అనిపించుకున్నాడు.
భవిష్యత్తు సంకల్పం…
ఉద్యోగ విరమణ అనంతరం తన జీవనంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అన్ని రాజకీయ పార్టీలతో, వివిధ సంఘాల నాయకులతో సత్సంబందాలు కొనసాగిస్తూ, సమాజ సేవ చేస్తూ, జరుగుతున్న బీసీ ఉద్యమాన్ని మరింత బలపరచడమే కాకుండా, తన పుట్టిన గ్రామానికి కూడా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నారు.

(ప్రతిష్టత్మాకమైన NIT వరంగల్ లో నాలుగు దశబ్దాలుగా పని చేసి ఉద్యోగ సంఘ నాయకుడిగా చెరగని ముద్ర వేసిన సుంకరి వేణుగోపాల్ పదవి విరమణ సందర్బంగా శుభాభినందనలతో)