అమిత్ షా 40 పేజీల తీర్పును చదివి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని అనుకుంటున్నా
సల్వా జుడుం తీర్పు నా వ్యక్తిగతం కాదు : జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజాస్వామ్యంలో లోటు స్పష్టంగా కనిపిస్తోందని, రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటోందని PTI కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన అభిప్రాయపడ్డారు.
సల్వా జుడుం తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుదర్శన్‌రెడ్డి, “ఆ తీర్పు నా వ్యక్తిగతం కాదు, సుప్రీం కోర్టు తీర్పు. నేను తీర్పు రచించినప్పటికీ అది నా తీర్పు కాదు. అమిత్ షా 40 పేజీల తీర్పును చదివి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని అనుకుంటున్నా” అని స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఏకగ్రీవంగా తనను ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. “ఈ నిర్ణయం 64 శాతం ప్రజల ప్రాతినిధ్యాన్ని సూచిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది వ్యక్తుల మధ్య పోటీ కాదు, భావజాలాల మధ్య పోటీ. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ, కాదు గానీ వ్యక్తిగత సంఘర్షణ కాదు” అని ఆయన పేర్కొన్నారు.
కుల గణనపై కూడా సుదర్శన్‌రెడ్డి స్పష్టమైన అభిప్రాయం తెలిపారు. “సామాజిక, ఆర్థిక విధానాల రూపకల్పన కోసం కుల గణన అవసరం. ఇది విధానాల తయారీలో సహాయపడుతుంది” అని అన్నారు.
పార్లమెంట్ వ్యవహారాలపై మాట్లాడుతూ ఆయన, “సభలో అప్పుడప్పుడు అంతరాయాలు కలిగించడం ఒక నిరసన రూపమే కానీ అది శాశ్వతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కాకూడదు. ఒకప్పుడు లోటు ఆర్థిక వ్యవస్థపై చర్చ జరిగేది. ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యంలో లోటు గురించి మాట్లాడుకుంటున్నాం. భారత్ ఇప్పటికీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో అది ఒత్తిడికి గురవుతోంది” అని వ్యాఖ్యానించారు.