పాలమూరుకు కేసీఆర్ ద్రోహం చేశాడు: సీఎం రేవంత్ రెడ్డి

cmrevanth redddy

జటప్రోలు (నాగర్‌కర్నూలు), జూలై 18:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా కేసీఆర్ పాలనలోనే పాలమూరుకు ఎక్కువ అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని జటప్రోలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రజలు విశ్వాసంతో ఎంపీగా గెలిపించినా, కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాంతానికి ఏమి చేయలేకపోయారని విమర్శించారు.

పాలమూరును చిన్నచూపు చూసిన కేసీఆర్‌కు మద్దతిస్తున్న స్థానిక నేతలు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు సిగ్గుపడాలని రేవంత్ వ్యాఖ్యానించారు. “పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకపోతే, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చూసి దుఃఖపడటం విడ్డూరం. కాంగ్రెస్ హయాంలో పాలమూరు అభివృద్ధి బాటలో ఉంది. కేసీఆర్ మాత్రం ఇప్పుడు ఆ అభివృద్ధిని చూసి దుఃఖిస్తున్నాడు. కానీ ఆయన శాపగ్రస్తుడు. ఆ దుఃఖం ఇక పదేళ్లు కొనసాగుతుంది,” అని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. “కాళేశ్వరం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ 2019లో నిర్మించిన ఈ ప్రాజెక్టు 2023 నాటికి కూలిపోయింది. అదే సమయంలో పాలమూరు ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు,” అని ఆరోపించారు.

తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల పాలన కాలాలను గుర్తు చేస్తూ… “2034 వరకు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది కేసీఆర్ గుండెల మీద రాసుకోవాలి,” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ప్రాంతీయ అభివృద్ధికి తన ప్రభుత్వమే గ్యారంటీ అని, వెనుకబడిన కొల్లాపూర్‌కు పూర్తి మద్దతుగా నిలబడతామని సీఎం హామీ ఇచ్చారు.

Ask ChatGPT

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE