కొత్తగూడెం, జులై 9: బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్మును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంపిణీ చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి రెండో విడత “బాయిబాట” కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
తాను ప్రాణం ఉన్నంత వరకు తిరిగి బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌పై క్విడ్ ప్రో కో ఆరోపణలు చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీశ్ రావు బాధ్యత వహించాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆమె విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటి వనరుల నిర్వహణపై సరైన అవగాహన లేదని, రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మేడిగడ్డ అంశాన్ని పరిష్కరించకుండా రైతులను మోసం చేస్తున్నారని, కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతు భరోసా, పెన్షన్లు, బోనస్ వంటి ఎన్నికల హామీలు ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ, నిజాం కాలంలో కేటాయించిన 17 గనుల్లో మిగిలిన గనులను కూడా సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. తాడిచర్ల–2 గనిని సింగరేణి సంస్థే నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు, అలియాస్ పేర్ల సమస్యలు, కార్మికుల భద్రత, బకాయిల చెల్లింపులు తదితర అంశాల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. అవసరమైతే నిరాహార దీక్ష చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఉద్యమకారుల హక్కులు, భూముల సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు. తమ పార్టీపై రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

