డిజిపిన్‌ను ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్.. ఇక ఖచ్చితమైన డిజిటల్ చిరునామా
న్యూఢిల్లీ: దేశంలో చిరునామాలను మరింత ఖచ్చితంగా గుర్తించేందుకు ఇండియా పోస్ట్ డిజిపిన్ (DigiPIN) అనే డిజిటల్ అడ్రస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది సంప్రదాయ పోస్టల్ చిరునామాకు తోడ్పాటుగా పనిచేసే కొత్త డిజిటల్ గుర్తింపు వ్యవస్థ.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆరు అంకెల పిన్‌కోడ్ ఒక పెద్ద ప్రాంతాన్ని సూచిస్తే, డిజిపిన్ 10 అక్షరాలు/అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్ ద్వారా ఇల్లు లేదా వ్యాపార సంస్థ ఉన్న ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించేలా రూపొందించారు. ఇండియా పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది సుమారు నాలుగు మీటర్ల పరిధిలో స్థానాన్ని గుర్తించగలదు.
డిజిపిన్ ద్వారా పోస్టులు, పార్సిళ్లు, ఈ-కామర్స్ డెలివరీలు సరైన చిరునామాలకు చేరే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే అంబులెన్స్, అగ్నిమాపక శాఖ, ఇతర అత్యవసర సేవలు గమ్యస్థానాన్ని త్వరగా గుర్తించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది.
డిజిపిన్ ఎలా తెలుసుకోవాలి?
డిజిపిన్ తెలుసుకోవడానికి ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://dac.indiapost.gov.in/mydigipin/home ను సందర్శించాలి. అక్కడ మ్యాప్‌లో మీ ఇంటి లేదా కార్యాలయ స్థానాన్ని ఎంపిక చేస్తే, ఆ ప్రాంతానికి సంబంధించిన 10 అక్షరాలు/అంకెల డిజిపిన్‌ను పొందవచ్చు.
డిజిపిన్‌ను ఇండియా పోస్ట్, ఐఐటీ హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థను ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇండియా పోస్ట్ తెలిపింది.
పోస్టల్ పిన్ కోడ్స్ కు చెల్లు చీటి -ఇక నుండి డిజి పిన్

