వరంగల్, ఆగస్టు 19:కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, వరంగల్ (కేఐటీఎస్‌డబ్ల్యూ) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ & ఎంఎల్) విభాగం ఆధ్వర్యంలో “నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఇంజనీరింగ్ విద్య” అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసకుడిగా న్యూ ఢిల్లీ విజ్ఞాన్ ప్రసార్ మాజీ శాస్త్రవేత్త, IISER మోహాలి విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.
కేఐటీఎస్‌డబ్ల్యూ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మికాంతరావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ సిఎస్‌ఎం విభాగాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరన్ 1800ల నుండి 2000ల వరకు పారిశ్రామిక విప్లవాల పరిణామాన్ని వివరించారు. ఎల్లోరా గుహలను భారతదేశ చరిత్ర, కళ, మత సామరస్యానికి ఉదాహరణగా ప్రస్తావించారు. అలాగే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ రంగాలలో అభివృద్ధులు “ఆఫ్ అబండెన్స్ యుగం”కి దారి తీస్తాయని చెప్పారు. దీనివల్ల వస్తువులు, సేవలు అందరికీ సులభంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు.
అకాడెమిక్ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్ మాట్లాడుతూ విద్యార్థులు కొత్త సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు సంపాదించేందుకు ఈ తరహా సెమినార్లు ఉపయోగపడతాయని తెలిపారు. సిఎస్‌ఎం విభాగం విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, సిఎస్‌ఎం విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్. నరసింహరెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఐ. సాయి రామకృష్ణ, అసోసియేషన్ ఇన్‌ఛార్జీలు బి. రాంజీ, డాక్టర్ కె. శివకుమార్, విద్యార్థి సమన్వయకర్తలు ఎం. శ్రీజని, జి. జ్ఞానదీప్, పిఆర్‌వో డాక్టర్ డి. ప్రభాకరాచారి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.