ఘనంగా గోదావరి పుష్కరాలు -దక్షిణ భారత కుంభ మేలాగా ఖ్యాతి గడించేలా నిర్వహించాలి- సీఎం

గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతి గడించేలా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు.

2027లో జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని చెప్పారు. ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడ అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించి అక్కడ అవసరమైన ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించాలన్నారు. మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు గోదావరి తీరం వెంట ఉన్న అన్ని ఆలయాలన్నింటినీ సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు.

పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్. జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు.

పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనుభవమున్న ఏజెన్సీలు, కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకోవాలన్నారు.

Share this post

3 thoughts on “ఘనంగా గోదావరి పుష్కరాలు -దక్షిణ భారత కుంభ మేలాగా ఖ్యాతి గడించేలా నిర్వహించాలి- సీఎం

  1. I haven’t checked in here for some time since I thought it was getting boring, but the last few posts are great quality so I guess I will add you back to my everyday bloglist. You deserve it my friend 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల