గ్రీవెన్స్ లో హనుమకొండ కలెక్టర్ కు పిర్యాదు చేసిన తెలంగాణ హాస్పిటల్స్, పేరెంట్స్ కోఆర్డినేషన్ కమిటి
ప్రజా ఆరోగ్యం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మందుల వినియోగం, ప్రజా ఆరోగ్యం, డాక్టర్ల పనితీరుపై శ్రద్ధ తీసుకోవడం లేదని, జనరిక్ మందులు వ్రాయడం, ఇతర ప్రజా ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ లను అమలు చేయాలని తెలంగాణ హాస్పిటల్స్ - పేరెంట్స్ కోఆర్డినేషన్ కమిటి రాష్ట్ర అధ్యక్షులు బి. సతీష్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ సంయుక్తంగా సోమవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కు ఇచ్చిన పిర్యాదులో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2011 లో జారీ చేసిన జి.ఒ.ఎం.ఎస్ నంబర్ 54, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016 లో జారీ చేసిన అతిసాదారణమైన నోటిఫికేషన్ పార్ట్ 3, సెక్షన్ 4 ప్రకారం మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన ప్రతి డాక్టర్ వారు వ్రాసే మందులను జనరిక్ పేర్లతో మాత్రమే వ్రాయాలని నిబంధన ఉన్నప్పటికీ చాలా మంది డాక్టర్లు వ్రాయడం లేదని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించే డాక్టర్లపై, హాస్పిటల్స్ పై వృత్తిపరమైన చెడు ప్రవర్తనకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలతో పాటు, అపరాధ రుసుము వేసి చర్యలు తీసుకునే అధికారం ఉన్నతాధికారులకు ఉందని నిబంధనలు ఉన్నపటికీ అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఎంసిఐ నిబంధనల ప్రకారం వివిధ ప్రజా ఆరోగ్య సమస్యలు, జనరిక్ మందుల వినియోగం కోసం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు, అమలు తీరుపై సమీక్ష జరపడం కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో జిల్లా స్థాయి కమిటీ (డి ఎల్ సి) నియమించాలని సూచనలు ఉన్నపటికీ అలాంటి కమిటీ నియమించలేదని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వెంటనే పేరెంట్స్, అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఫార్మసీ కంపెనీలతో కుమ్ముకైన డాక్టర్ల దోపిడీని అరికట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఎఫ్ నాయకులు ఐతం నగేష్, న్యాయవాదులు మొగిలయ్య, ఎగ్గడి సుందర్ రామ్ లు పాల్గొన్నారు.