లక్ష్యం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు…
*
లైఫ్ సైన్సెస్ లో 5 లక్షల మందికి ఉపాధి
*
2030 నాటికి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు
*
త్వరలోనే అందుబాటులోకి “కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ”
*
“బయో-డిజిటల్” యుగానికి అనుగుణంగా రెడీ టూ వర్క్ ఫోర్స్
*
తెలంగాణ అంటే భవిష్యత్తు… అవకాశాల ఖని
*
“ఆస్‌బయోటెక్ 2025” సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి… 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ “గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.
*** 250 బిలియన్ డాలర్లకు చేర్చేలా….
భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2024-2025లో తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా, జాతీయ సగటు కేవలం 7.6 శాతం మాత్రమే ఉందన్నారు. గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే “కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ” ని అందుబాటులోకి తెస్తామన్నారు.
*** భారత్ నుంచి హైదరాబాద్ మాత్రమే….
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ రూపొందించిన ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ కు చోటు దక్కిందన్నారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన మన నగరం నిలిచిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా…2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందన్నారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాబోయే “బయో-డిజిటల్” యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు.
*** మా నినాదం “ఇన్వెంట్ ఇన్ తెలంగాణ”…
మా నినాదం మేడిన్ ఇండియా కాదు… ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన “ఎకో సిస్టం” తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, బీ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సాహకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ , దేశంలోనే సాటి లేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
*** ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి….
సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్స్, మెడ్‌టెక్, ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ , హెల్త్‌టెక్, ఏపీఐ బల్క్ డ్రగ్ ఉత్పత్తి, ఫార్మా ప్యాకేజింగ్, గ్లాస్ ట్యూబింగ్, ట్రాన్స్‌లేషనల్ బయోటెక్ రీసెర్చ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, జీనోమిక్స్ , గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్,అగ్రి బయోటెక్, యానిమల్ హెల్త్ తదితర రంగాల్లో తెలంగాణ లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా కంపెనీలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సదస్సు “విక్టోరియా–తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్” కు నాంది పలకాలని ఆకాంక్షించారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ ఛైర్మన్ డా. జేమ్స్ క్యాంప్‌బెల్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.