పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి – సీఎం రేవంత్ రెడ్డి

గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21:
గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన “పోలీస్ ఫ్లాగ్ డే” పరేడ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “పోలీస్ అంటే సమాజానికి నమ్మకం, భరోసా” అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

“విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ కర్తవ్యంతోనే ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం,” అని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 191 మంది, తెలంగాణలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. వీరిలో గ్రేహౌండ్స్ కమాండోలు టి. సందీప్, వి. శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్, అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి. సైదులు, నిజామాబాద్‌ సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ ఉన్నారని తెలిపారు.

ప్రమోద్ కుమార్ కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, లాస్ట్ పే డ్రాన్ సాలరీ, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం, అదనంగా వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.24 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.

ఒరిస్సాలో 2008లో మావోయిస్టుల దాడిలో వీరమరణం పొందిన 33 మంది పోలీసు కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలాలు కేటాయించామని సీఎం గుర్తుచేశారు.

పోలీసు శాఖ గర్వకారణం – సీఎం
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలో తెలంగాణ పోలీస్ శాఖకు మొదటి స్థానం లభించడం, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో విదేశాంగ శాఖ నుంచి అభినందనలు రావడం పోలీసుల కృషికి నిదర్శనమని తెలిపారు.

సైబర్ నేరాలు, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి ఆధునిక నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నారని తెలిపారు. “సైబర్ సెక్యూరిటీ బ్యూరో” దేశంలోనే ఉత్తమ విభాగంగా గుర్తింపు పొందిందని అన్నారు.

డ్రగ్స్‌ నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ‘ఈగిల్ వింగ్’ సమర్థంగా పనిచేస్తోందని, డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

నగ్జలైట్లు జనజీవన శ్రవంతిలో కలిసి దేశాభి వృద్ధికి తొడ్పడాలని సీఎం సూచించారు. ఈ మధ్య కాలంలో నక్షలైట్లు లొంగిపోయిన విషయం ప్రస్థావించారు.

మహిళా ఐపీఎస్ అధికారుల ప్రతిభ గర్వకారణం
మహిళా అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు. “హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ జోన్‌లలో మహిళా డీసీపీల సేవలు రాష్ట్ర పోలీస్ ప్రతిష్టను పెంచుతున్నాయి,” అన్నారు.

పోలీసు సంక్షేమం పై ప్రభుత్వం కట్టుబడి ఉంది
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల కొత్త నియామకాలు చేశాం,” అని చెప్పారు.

విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు ఇంటి స్థలం, ఉద్యోగం, ఉచిత విద్య, వైద్య సేవలు, బస్ పాస్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

అలాగే మృతుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని కోటి నుండి రెండు కోట్ల రూపాయల వరకు పెంచినట్లు వెల్లడించారు.

పోలీసుల పిల్లల విద్యకు ప్రత్యేక చర్యలు
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశామని తెలిపారు.

సీఎం సందేశం
“పోలీసు శాఖ గౌరవం పెరగడం అంటే రాష్ట్ర గౌరవం పెరగడమే. పారదర్శకత, నైతిక విలువలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి – ఇవే పోలీసింగ్‌కు మూలాధారాలు కావాలి,” అని సీఎం అన్నారు.

“శాంతి ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే సమాజంలో శాంతి, భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం,” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

చివరగా, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో