_జయంతి నేడు.._
23.07.1906
ఎవరైతే పౌరుషానికి అర్థమో
ఎవరికి స్వరాజ్యసాధనే
పరమార్థమో..
ఎవరు ఎంతకీ లొంగని
జడపదార్థమో..
అర్థం కాని
బ్రహ్మపదార్థమో
ఎవరి దేశభక్తి కల్ల ఎరుగని..
ఎల్ల తెలియని యదార్థమో..
అతడే అజాద్..!
దేహంలో దారుఢ్యం..
దేశభక్తిలో మౌడ్యం..
మాట వినని ఇజం..
మాటే నిజం…
అదే చంద్రశేఖరిజం..!
సంస్కృతమే మాధ్యమం..
ఆ పాఠశాలలోనే
మొదలైంది ఉద్యమం..
బాపూ సహాయనిరాకణం
ఇస్తే ప్రేరణం..
బడిలోనే శ్రీకారం చుట్టి రణం
రివ్వున దూసుకొచ్చిందీ
స్వేచ్చాకిరణం..!
గాంధీని నమ్మినా
ఆయన సిద్ధాంతం
కాలేదేమో స్ఫూర్తి..
దాడికి విరుగుడు ఎదురుదాడి..
తుపాకీకి బదులు బందూకే..
హింసకు ప్రతిహింసే సమాధానం..
లేదులే గాంధీలా నిదానం..
అందుకే భగత్ సింగ్..
సుఖదేవ్ తో దోస్తీ..
తెల్లోడిపై జబర్దస్తీ..!
పాలబుగ్గల పసిప్రాయంలోనే
దొరలపై తిరుగుబాటు..
గుండెల్లో గుండు దిగినా
చేయి తెగినా..
కుడి నుంచి ఎడమకు
మార్చి రైఫిల్..
చూపించినాడట
భారతీయ
శౌర్య శాంపిల్..!
పసి వయసులోనే
పట్టి కోర్టు బాట..
న్యాయమూర్తినే
కసిగా చూసిన అగ్గిబరాటా..
పేరు అజాదని
ఊరు స్వరాజ్యమని..
జైలే ఇల్లని..
జడ్జికి చప్పున చెప్పిన
మొండిఘటం..
మడమ తిప్పని చేతివాటం
కొరడా దెబ్బల శిక్షను
నవ్వుతూ భరించిన
సొంత శిక్షణ..
శత్రువు చేతిలో మరణం
మండని చితిలో దహనంగా
భావించి తనకు తానే
కాల్చుకుని వీరమరణం
పొందిన అజాదు..
అహంకారానికి తలవంచని
స్వేచ్ఛా వస్తాదు..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286