తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆయుధాలతో లొంగి పోయిన 130 మంది మావోయిస్టులు

• లొంగిపోయిన మావోలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్న సీఎం
• ఆర్థిక, వైద్య సాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ
• చర్చల ద్వారానే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతామన్న ముఖ్యమంత్రి
• ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు
• లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు
• తెలంగాణకు చెందిన నలుగురు లొంగుబాటు


మావోయిస్టు కీలక నేత గణపతి లొంగిపోవాలని, ఆయనకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మావోయిస్టులపై అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారికి ఆర్థిక, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు లేవనెత్తే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. వారు తమకు వైద్య సాయం కావాలని కోరారని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వారికి మంచి ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు భూమి ఇచ్చే విషయం ఇప్పుడే ఏమీ చెప్పలేనని వెల్లడించారు.
అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు హామీ ఇస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాటు కోసం అధికారులు చాలా కృషి చేశారని ప్రశంసించారు. శాంతియుత చర్చల ద్వారానే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు తమకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావొచ్చని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్ కుమార్ గౌడ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలలో చేరాలనుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. సొంత గ్రామాల్లో ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య మార్గంలో ప్రజా సమస్యలను చర్చిద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 125 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు, నలుగురు తెలంగాణకు చెందినవారు, మరొకరు ఏపీకి చెందినవారు ఉన్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మావోయిస్టులు ఆయుధాలతో పాటు లొంగిపోయారు. మొత్తం నాలుగు బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న మావోయిస్టులు పోలీసులకు తమ ఆయుధాలను అప్పగించారు.
లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, నూనె నరసింహా రెడ్డి, మల్లా రాజిరెడ్డిల గన్‌మెన్లు ఉన్నారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు, పీఎల్‌జీఏకు చెందిన బెటాలియన్ లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టుల్లో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె మాధవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు ఒక్కరొక్కరుగా లొంగిపోతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు స్టేట్ కమిటీ, పదిమంది డివిజనల్ కమిటీ, నలభై మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు చెప్పారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం