భక్తుల జనసంద్రంగా మారిన జంపన్న వాగు


తేదీ: 28-01-2026
ఎస్.ఎస్. తాడ్వాయి మండలం, ములుగు జిల్లా

భక్తుల జనసంద్రంగా మారిన జంపన్న వాగు

పుణ్య స్నానాలతో జనం పరవళ్లు

పులకించిన మేడారం మహా జాతర

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు సంప్రదాయం ప్రకారం జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించే ఈ మహా జాతరకు హాజరయ్యే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానం చేయడం అనవాయితీగా కొనసాగుతోంది. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునుంచే వాగు వద్దకు చేరుకుని స్నానాలు ఆచరిస్తున్నారు.

భక్తులు జంపన్న వాగు తీరంలో ఇసుకతో వన దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివసత్తుల పునకాల మధ్య “పదివేల దండలే తల్లి అబ్బిస్సా” అంటూ సమ్మక్క తల్లిని స్తుతిస్తూ పబ్బతులు పడుతూ పుణ్య స్నానాలు చేస్తున్నారు.

అనంతరం వన దేవతలకు ఓడి బియ్యం, బంగారం సమర్పించి తమ మొక్కులను చెల్లిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మలను తమ ఇంటి ఇలవేల్పులుగా, కొంగు బంగారంగా భావిస్తూ కోరిన కోర్కెలు నెరవేరాలని భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తున్నారు.

మేడారం మహా జాతర నేపథ్యంలో జంపన్న వాగు పరిసర ప్రాంతాలు భక్తి, సంప్రదాయాలతో అలరారుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Share this post

One thought on “భక్తుల జనసంద్రంగా మారిన జంపన్న వాగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన