ఎస్.ఎస్. తాడ్వాయి మండలం.
ములుగు జిల్లా.
మేడారం మహాజాతరకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున తుది దశకు చేరుకున్న అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, అవసరమైన మెరుగులు దిద్దాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం లోని మేడారం హరిత హోటల్ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులు ఎక్కువగా ఇబ్బందులు పడే అంశాలైన తాగునీరు, మరుగుదొడ్లు, వంటివి నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం జంపన్న వాగులో నిరంతరం షిఫ్టుల వారీగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాతర ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్లను మోహరించాలని తెలిపారు.
భక్తుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి టీటీడీ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన 50 పడకల ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేడారం జాతరను సమర్థవంతంగా నిర్వహించినప్పుడే జాతర నిజంగా విజయవంతమైనదిగా భావించవచ్చని పేర్కొంటూ, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ఈ నెల 18న మేడారంలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను అభినందించారు.
రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల నిర్వహించిన కేబినెట్ సమావేశాన్ని కూడా సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.
మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సజావుగా నిర్వహించినందుకు అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇది జిల్లా యంత్రాంగం సమన్వయం, అంకితభావానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

