హనుమకొండ బార్ అధ్యక్షులు పులి సత్యనారాయణ
భారతదేశానికి అసలైన మహాత్ముడు జ్యోతీరావు ఫూలే అని హన్మకొండ బార్ అసోషొయేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ అన్నారు. మహాత్మా ఫూలే 135 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన అధ్యక్షతన హనుమకొండ బార్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులంతా మహాత్మా జ్యోతీరావు ఫూలే స్ఫూర్తితో సంఘ పరివర్తన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలి ఆధునిక సాంఘిక విప్లవకారుడు ఫూలే మహిళలకు, శూద్రులకు, అస్పృశ్యుల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడిన నాయకుడని ఆయన కొనియాడారు. అసమానతలకు వ్యతిరేకంగా శత్రువుతో బరిగీసి పోరాడిన వీరుడు ఫూలే అని సీనియర్ న్యాయవాది గుడిమల్ల రవి అన్నారు.
బహుజన సమాజాన్ని విముక్తి చేయడానికి ఉద్యమించిన తొలి విప్లవకారుడు ఫూలే అని, తొలి కార్మిక సంఘాన్ని స్థాపించిన కార్మిక ఉద్యమ పితామహుడనీ, తొలి రైతు ఉద్యమ నేత, తొలి వ్యవసాయ కూలీ ఉద్యమ నేత, తొలిసారి అణగారిన వర్గాల చరిత్ర రాసిన చరిత్రకారుడనీ న్యాయవాది డాక్టర్ జిలుకర శ్రీనివాస్ అన్నారు. ఫూలే తన భార్య సావిత్రిబాయి ఫూలేకు చదువు చెప్పి తొలి మహిళా టీచరుగా చరిత్ర సృష్టించాడని సీనియర్ అడ్వకేట్ గంధం శివ కీర్తించాడు. ఆ మహనీయుని స్ఫూర్తితో బహుజనులు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చాడు. చిన్ననాడు అనుభవించిన కుల వివక్ష ఫూలేను ఆలోచించేలా చేసిందనీ, కుల అసమానతలను సమర్ధించే కల్పితకథలను, ఆచారాలను ఆయన తిరస్కరించేలా చేసిందని న్యాయవాది సాయిని నరేందర్ అన్నాడు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, సీనియర్ న్యాయవాదులు జయాకర్, చిల్లా రాజేంద్ర ప్రసాద్, కృష్ణస్వామి, గుడిమల్ల రవికుమార్, కొత్త రవికుమార్, దయాన్ శ్రీనివాస్, నల్ల మహాత్మా, అంబేద్కర్, వెంకటేష్, సునీల్ కుమార్, కమలాకర్, నిఖిల్, న్యాయవాదులు చిరంజీవి, సురేందర్, జి ఆర్ శ్రీనివాస్, సాయిని నరేందర్, గంధం శివ, వేముల రమేష్, జన్ను ప్రభాకర్, ఎగ్గడి సుందర్ రామ్, దండు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

